మేడారం మినీ జాతర.. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి..

మేడారం మినీ జాతర.. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి..

ములుగు జిల్లా: దేశంలోనే తెలంగాణలో జరిగే మేడారం జాతరకు విశేషమైన గుర్తింపు ఉంది. మేడారం మినీ జాతర తేదీలను సమ్మక్క-- సారలమ్మ పూజారులు ప్రకటించారు. 2025 ఫిబ్రవరి 12 తేదీ నుంచి 15 వరకు పూజారులు మినీ జాతరను నిర్వహించనున్నారు. మినీ మేడారం జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకరారు. గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయనున్నారు. కాగా ప్రతి రెండేళ్లకోసారి మేడారం మహాజాతర జరుగుతుంది.

 

మినీ మేడారం జాతరకు కూడా భక్తులు భారీగా వస్తుంటారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతుంటాయి. మండమెలిగే పండుగ సందర్భంగా మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తారు. తల్లులను చూసి పులకించిపోతారు. గద్దెల ముందు పొర్లు దండాలు పెడతారు. సారె చీరలు, బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. గొర్రె, మేకపోతులు, కోడిపుంజులను బలిచ్చి, విందు చేసుకుంటారు. మన రాష్ట్రం నుంచే కాక చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు.

ALSO READ | ఆధ్యాత్మికం : ఙ్ఞానం అంటే ఏంటీ.. శ్రీకృష్ణుడు చెప్పిన సారాంశం ఏంటీ.. జ్ణానం కంటే గొప్పది లేదా..?

పెద్ద జాతరకు వెళ్లొచ్చిన భక్తులు, మినీ మేడారం పేరుతో తిరిగి ఇళ్లల్లో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మేడారంలో మండమెలిగే పండుగ మొదలుకావడంతో ఊర్లలో తల్లులకు పూజలు నిర్వహిస్తుంటారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. బంధువులు, చుట్టుపక్కల వారిని పిలుచుకొని ఇంట్లోనే సమ్మక్క పండుగ చేసుకుంటారు.