ఇవ్వాళ్టి(ఫిబ్రవరి 12) నుంచి మినీ మేడారం జాతర

ఇవ్వాళ్టి(ఫిబ్రవరి 12) నుంచి మినీ మేడారం జాతర
  •     నాలుగు రోజుల పాటు జరగనున్న వన జాతర
  •     హాజరుకానున్న 10 లక్షల మంది భక్తులు
  •     రూ.5.30 కోట్లతో సర్కారు ఏర్పాట్లు

జయశంకర్‌‌‌‌‌‌‌‌  భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు : మేడారం మినీ జాతర నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. మండమెలిగే పండుగ వేళ సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొనేందుకు భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రూ.5.30 కోట్లతో రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు చేసింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ప్రతీ రెండేండ్లకోసారి సమ్మక్క, సారలమ్మ మహాజాతర జరుగుతుంది. ఏడాది తరువాత గిరిజన సంప్రదాయం ప్రకారం మండమెలిగె పండుగ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనినే మినీ మేడారం జాతరగా భక్తులు పిలుచుకుంటారు.

జాతర సాగేదిలా..

మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయాలను ఆదివాసీ పూజారులు బుధవారం శుద్ది చేస్తారు.  ఊరు పొలిమేరల్లో ద్వార స్తంభాలు కట్టి గ్రామ నిర్బంధం చేస్తారు. 13న  సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద పసుపు కుంకుమతో అర్చన జరిపి పూజలు నిర్వహిస్తారు. 14న భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. 15న అమ్మవార్లకు ఆలయ పూజారులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తారు. దీంతో మండ మెలిగే పండుగ(మినీ జాతర) ఘట్టం ముగుస్తుంది. 

ఏర్పాట్లు పూర్తి..

మినీ మేడారం జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం రూ.5.30 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే ఆఫీసర్లు పనులు పూర్తి చేయించి మినీ జాతరకు అంతా సిద్ధం చేశారు. జంపన్న వాగులోని ఫిల్టర్  బావులకు మోటార్లు ఫిట్  చేసి స్నాన ఘట్టాలపై ఉన్న పైపులైన్లకు కనెక్షన్  ఇచ్చి టాప్స్ ను ఏర్పాటు చేశారు. 

భక్తులు విడిది చేసే ప్రాంతాల వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేయనున్నారు. 18 బాత్  క్యాప్స్, ఆరు వాటర్  ట్యాంకులు, రహదారుల వెంట 400 నల్లాలను ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎండోమెంట్  ఆఫీసర్లు అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తుల కోసం క్యూలైన్ల వద్ద చలువ పందిళ్లు, తాగునీటి కోసం నల్లాలు ఏర్పాటు చేశారు. 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు  పోలీస్​ ఆఫీసర్లు తెలిపారు. 

కల్యాణ మండపంలో 30 పడకల ఉచిత వైద్య శిబిరాన్ని, జంపన్న వాగు, ఆర్టీసీ బస్టాండ్​ వద్ద మినీ హెల్త్ సబ్  సెంటర్లను ఏర్పాటు చేశారు. 20 మంది స్పెషలిస్ట్  డాక్టర్లు, 40 మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. జాతర సందర్భంగా 400 మంది కార్మికులతో పారిశుధ్య పనులు చేయించనున్నారు. జంపన్న వాగు, దేవతల గద్దెల కోర్ ఏరియా, ఊరట్టం, కన్నేపల్లి, చిలకలగుట్ట, ప్రాంతాల్లో చెత్త సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి..

మినీ మేడారం జాతరకు సర్కారు తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశా. భక్తులు అధికారుల సూచనలు పాటించాలి. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులతో సమావేశం నిర్వహించి భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించాం.

– దివాకర టీఎస్, కలెక్టర్