మినీ మేడారం జాతరకు రూ.32 కోట్లతో ఏర్పాట్లు

  • మరో 24 రోజుల్లో మొదలుకానున్న సమ్మక్క, సారలమ్మ జాతర
  • డెవలప్​మెంట్​​ వర్క్స్​పై నేడు ములుగులో మంత్రి సమీక్ష

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు: భక్తుల కొంగు బంగారం శ్రీ సమ్మక్క సారలమ్మ కొలువుదీరిన మేడారం మినీ జాతర కోసం ముస్తాబువుతోంది. వచ్చే నెల 12 నుంచి 15 వరకు మినీ మేడారం జాతర జరగనుంది. 24 రోజుల గడువు మాత్రమే ఉంది. నాలుగు రోజుల పాటు జరిగే మినీ జాతరకు 20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల తరపున రూ.32 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది.

మినీ జాతర నిర్వహణ కోసం ఇప్పటికే రూ.4.40 కోట్లను కేటాయించింది. ఇప్పటికే వనదేవతల దర్శనానికి ప్రతి ఆదివారం వేలాదిగా భక్తజనం తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మినీ మేడారం జాతరపై ఆదివారం ములుగులో జిల్లాస్థాయి ఆఫీసర్లతో మంత్రి సీతక్క సమీక్ష చేయనున్నారు.

రూ.32 కోట్లతో వర్క్స్..

గతానికి కంటే భిన్నంగా ఈసారి మంత్రి సీతక్క చొరవతో మినీ మేడారం జాతరకు మూడు నెలల ముందే రూ.32 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇందులో పంచాయతీరాజ్​ శాఖ నుంచే రూ.22 కోట్లతో రోడ్ల పనులు స్టార్ట్‌‌‌‌  చేశారు. మేడారం, కన్నెపల్లి, కాల్వపల్లి, ఊరట్టం గ్రామాల్లో సీసీ రోడ్లు, పీఆర్‌‌‌‌ రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టారు. మేడారం గద్దెల వద్దకు వచ్చే క్యూలైన్లపై పర్మినెంట్‌‌‌‌గా చలువ పందిళ్ల నిర్మాణం కోసం రూ.3 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

దేవాదాయ శాఖ తరపున రూ.5.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.1.80 కోట్లతో మేడారం, కన్నెపల్లిలో శ్రీ సమ్మక్క, సారలమ్మల ఆలయాలు నిర్మిస్తున్నారు. రూ.1.50 కోట్లతో పూజారుల గెస్ట్‌‌‌‌హౌజ్‌‌‌‌, రూ.2.20 కోట్లతో వీవీఐపీ గెస్ట్‌‌‌‌హౌజ్‌‌‌‌ పనులు చేపడున్నారు. ఇక మినీ మినీ జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.4.40 కోట్లు కేటాయించింది. 

గిరిజన సంప్రదాయం ప్రకారం..

మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క సారలమ్మ మహాజాతర జరుగుతుంది. ఈ జాతర ముగిసిన ఏడాది తర్వాత గిరిజన సంప్రదాయం ప్రకారం మండమెలిగె పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనినే మినీ మేడారం జాతరగా భక్తులు పిలుచుకుంటారు. ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర జరగనుంది.

ఆ సమయంలో అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు తరలివస్తారు. ఈసారి జాతరకు 20 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేసి, అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.