
జైపూర్(భీమారం), వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే భీమారం మండల కేంద్రంలో మినీ స్టేడియం కోసం ఐదెకరాల భూమిని కేటాయించడం హర్షనీయమని క్రీడాకారులు, యువకులు అన్నారు. మినీ స్టేడియం కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిలో రెవెన్యూ అధికారులు హద్దులు వేశారు. ఇందుకు కృషిచేసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఫొటోకు మండల కేంద్రంలోని యువతతో కలిసి కాంగ్రెస్ సీనియర్ లీడర్ పొడేటి రవి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యేను కలిసి మండల కేంద్రంలో మినీ స్టేడియం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరడంతో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కలెక్టర్ కుమార్ దీపక్‌తో ఎమ్మెల్యే మాట్లాడి మినీ స్టేడియం కోసం భూమి కేటాయించారని అన్నారు.
తమ చిరకాల వాంఛ నెరవేర్చారని హర్షం వ్యక్తం చేశారు. పొడేటి రవి, వ్యాపారులు, నల్లాల రాజ లింగు కొంత డబ్బు విరాళంగా అందించడంతో జేసీబీలు, ట్రాక్టర్లతో మంగళవారం పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేతలు భూక్య లక్ష్మణ్, జర్పుల రాజ్ కుమార్ నాయక్, పెద్దల బాపు, ఉస్కమల్ల శ్రీని వాస్, బాల రాంరెడ్డి, వేల్పుల శ్రీనివాస్, ఆవిడపు రవి తేజ, క్రీడాకారులు పాల్గొన్నారు.