Health Alert : మినీ స్ట్రోక్స్ పెరిగిపోతున్నాయి.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. నిర్లక్ష్యం చేస్తే బ్రెయిన్ స్ట్రోకే..!

Health Alert : మినీ స్ట్రోక్స్ పెరిగిపోతున్నాయి.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. నిర్లక్ష్యం చేస్తే బ్రెయిన్ స్ట్రోకే..!

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు వయసుమీరిన వారికే పరిమితమైన మినీ  (బ్రెయిన్) స్ట్రోక్ సమస్య, ఇప్పుడు యువతలోనూ కనిపిస్తోంది.  

మితిమీరిన ఒత్తిడి, ఆహారం, జీవనశైలి కారణాల వల్ల స్ట్రోక్ సమస్య తీవ్రమై ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలిగిస్తుంది. మెదడుకు వెళ్లే రక్తనాళంలో బ్లాక్ ఏర్పడి రక్తప్రసరణ సరిగా లేకుంటే స్ట్రోక్ వస్తుంది. కొన్నిసార్లు చిన్నపాటి పక్షవాతం సంభవించవచ్చు. పెద్ద స్ట్రోక్ సంభవించినట్లయితే అది ప్రాణాంతకం కావచ్చు. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, మెదడుకు రక్త సరఫరా లోపించినప్పుడు ఇలా జరుగుతుంది. మొదట స్ట్రోక్‌ చిన్నగా ఉంటే వైద్యుడి సంప్రదించాలి. ఎందుకంటే అది తర్వాత పెద్ద స్ట్రోక్‌కి దారితీయవచ్చు.

మినీ స్ట్రోక్‌ను తాత్కాలిక ఇస్కీమిక్ అటాక్ (TIA) అని అంటారు. మెదడుకు రక్తప్రసరణ చాలా కాలం పాటు సరిగా లేనప్పుడు ఈ స్ట్రోక్ వస్తుంది. రక్తం కొన్ని నిమిషాల పాటు ఆగిపోయి తర్వాత సాధారణ స్థితికి రావచ్చు. దీని వల్ల పెద్దగా నష్టం ఉండదు. కానీ ఇది రాబోయే పెద్ద స్ట్రోక్ సూచన. మినీ స్ట్రోక్ ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి.

తిమ్మిరి పట్టడం:  ఒక్కోసారి శరీరం  హఠాత్తుగా  మొద్దుబారినట్లు అవుతుంది. అంటే తిమ్మిరి పట్టి ముఖం ఒక వైపునకు వాలిపోతూ ఉంటుంది.  శరీరం సమతుల్యతను కోల్పోతుంది.  ముఖం ఒక వైపు కండరాలు నియంత్రణ కోల్పోవచ్చు. ముఖంలో కొంత భాగం మొద్దుబారవచ్చు. ఇది పదేపదే జరిగితే వైద్యుడిని సంప్రదించాలి. శరీరంలాగే చేతులు కూడా మొద్దుబారిపోయి అలసిపోతాయి. ఇది రెండు చేతులకు కావచ్చు సాధారణం కంటే ఎక్కువ అలసిపోయినట్లు అనిపించవచ్చు. ఇది శరీరంలోని ఒక భాగంలో మాత్రమే జరుగుతుంది. మెదడులోని కొన్ని భాగాలకు బ్లడ్​ సర్క్యులేషన్​ సరిగా లేకపోవడంతో ఇలాంటి లక్షణాలు ఏర్పడుతాయి.  ఇలాంటి లక్షణాలను గుర్తిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. 

సరిగా మాట్లాడలేకపోవడం: ఒక్కోసారి  మాట్లాడటమే ఇబ్బందిగా మారుతుంది. ఇతరులు మాటలు కూడా అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. అలాంటి సమయాల్లో ఏమి జరుగుతుందో వారికి తెలిసినా ఇతరులకు చెప్పేందుకు చాలా ఇబ్బంది పడతారు.  మెదడులోని కొన్ని భాగాలకు రక్త ప్రసరణ లేకపోతే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది.  ఇలాంటి తరచూ వస్తుంటే బ్రెయిన్​ స్ట్రోక్​ కు దారితీయవచ్చు.   మినీ స్ట్రోక్ వస్తే నత్తిగా మాట్లాడతారు. సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు, ఆలోచించలేకపోవచ్చని నిపుణులు అంటున్నారు.కాబట్టి ఇలాంటి లక్షణాలను గుర్తిస్తే వెంటనే డాక్టర్​ ను సంప్రదించండి.  

కంటిచూపు సమస్య:  కంటి చూపు మందగించడం, ఒక కంటి చూపు పూర్తిగా కోల్పోవడం వంటివి మినీ  స్ట్రోక్ లక్షణాలు. మెదడులోని దృష్టిని నియంత్రించే భాగానికి రక్త ప్రసరణకు  అంతరాయం కలిగితే ఇలాంటి లక్షణాలు ఏర్పడుతాయి,   ఒక్కోసారి రెండు కళ్లకు కూడా దృష్టి సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. 

తలతిరగడం:  ఒక్కోసారి అకస్మాత్తుగా తల తిరగడం.. కళ్లు తిరగడం లాంటి సమస్యలు వస్తాయి. ఆ సమయంలో నడవడం.. నిలబడటం చాలా కష్టం.  మెదడు కదలికను సమతుల్యం చేయడానికి తగినంతగా రక్త ప్రసరణ లేకపోతే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. 

 తీవ్రమైన తలనొప్పి: ఇతర లక్షణాల కంటే TIA లలో తలనొప్పులు తక్కువగా ఉన్నప్పటికీ, కొంతమందికి ఎటువంటి కారణం లేకుండానే అకస్మాత్తుగా మరియు తీవ్రమైన తలనొప్పి రావచ్చు. ఇది మెదడుకు రక్త ప్రవాహంలో అకస్మాత్తుగా తగ్గుదలకు సంకేతమని నిపుణులు అంటున్నారు. శరీరం సమతుల్యతను కోల్పోతుంది. సాధారణం కంటే ఎక్కువ అలసిపోయినట్లు అనిపించవచ్చు. డీహైడ్రేషన్ కూడా శరీర అసమతుల్యత, అలసటకు కారణమవుతుంది. ఇది శరీరంలోని ఒక భాగంలో మాత్రమే జరుగుతుంది.

ALSO READ | Health Alert : ఫ్యాటీ లివర్ అంటే ఏంటీ.. చిన్న పిల్లల్లో ఎక్కువ ఎందుకు వస్తుంది.. లక్షణాలు ఏంటీ.. చికిత్స ఎలా..?

మినీ  స్ట్రోక్ రిస్క్ బారిన పడకుండా ఉండాలంటే, బ్యాలెన్స్‌డ్ డైట్ పాటించడంతో పాటు రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. స్మోకింగ్ మానేసి ఒత్తిడిని తగ్గించుకోవాలి. బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని రెగ్యులర్‌గా మానిటర్ చేసుకుంటే రిస్క్ నుంచి తప్పించుకోవచ్చు. సిటి స్కాన్లు, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్టుల వంటివి స్ట్రోక్ తీవ్రతను సూచిస్తాయి. ఈ రిపోర్టులను బట్టి చికిత్స తీసుకుంటే సురక్షితంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.