గోదావరిఖని, వెలుగు: పదేండ్లు అధికారంలో ఉండి సింగరేణి సంస్థను కేసీఆర్, కవిత, టీబీజీకెఎస్ నేతలు నిండా ముంచారని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్, మినిమమ్ వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి.జనక్ ప్రసాద్ ఒక ప్రకటనలో ఆరోపించారు. పెద్దపల్లి పర్యటనలో కాంగ్రెస్‌పై, సీఎం రేవంత్‌రెడ్డిపై కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సింగరేణి సంస్థ నిధులను గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఖర్చు పెట్టి ఆర్ధికంగా నష్టం కలిగించారని విమర్శించారు.
శ్రీరాంపూర్‌లో జరిగిన బహిరంగ సభలో కార్మికులకు 10 వేల క్వార్టర్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. మారుపేరుతో పని చేసిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో చర్యలు తీసుకుంటామని చెప్పిన కవిత దాని గురించి పట్టించుకోలేదని పేర్కొన్నారు. పదేండ్లుగా పట్టించుకోకుండా నేడు మొసలి కన్నీరు కార్చుతున్నారని ఎద్దేవా చేశారు. కవిత ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్లో బొగ్గు బ్లాక్‌ల వేలం కోసం చట్టం తీసుకువస్తే మద్దతు తెలిపి, నేడు బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటుపరం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులకు రూ.కోటి, కాంట్రాక్టు కార్మికులకు రూ.40 లక్షల ప్రమాద బీమా స్కీమ్ ప్రారంభించారని తెలిపారు.