మహబూబ్‌నగర్, వెలుగు: కురుమూర్తి టెంపుల్ చుట్టూ మైనింగ్ మాఫియా వాలింది. కొద్ది నెలల కిందట టెంపుల్ వెనక ఉన్న గుట్టలో స్టోన్, మెటల్ కోసం క్వారీకి పర్మిషన్లు ఇవ్వగా, దీని ప్రభావం టెంపుల్‌పై పడుతోంది. కొండ రాళ్లను పగులకొట్టేందుకు బ్లాస్టింగ్ చేస్తుండడంతో టెంపుల్ ఉన్న కొండ దద్దరిల్లుతోంది. బ్లాస్టింగ్ ధాటికి వ్యవసాయ బోర్లు కూడా పూడిపోతుండటంతో రైతులు క్వారీ పర్మిషన్లు రద్దు చేయాలని ఆందోళనకు దిగుతున్నారు.
తిరుపతి తరహాలోనే ఏడుకొండలు..
జిల్లాలోని అమ్మాపూర్ సమీపంలో ఉన్న కురుమూర్తి క్షేత్రం వద్ద తిరుపతి తరహాలోనే ఏడు కొండలున్నాయి. అందులో శ్వేతాద్రి, దుర్గాద్రి, ఘనాద్రి, భల్లుకాద్రి, పతకాద్రి, దేవతాద్రి కొండలు ఉండగా, దేవతాద్రి కొండపై వేంకటేశ్వర ఆలయం ఉంది. ఈ ఏడు కొండలు దాదాపు వెయ్యి ఎకరాల్లో విస్తరించి ఉన్నట్లు రెవెన్యూ ఆఫీసర్ల ద్వారా తెలిసింది. అయితే దేవతాద్రి గుట్ట దగ్గర్లోనే పెద్దతిప్ప గుట్ట ఉంది. ఈ గుట్ట రెవెన్యూ రికార్డుల ప్రకారం అమ్మాపూర్ శివారులోని సర్వే నంబర్ 89లో దాదాపు 150 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉండగా, ఈ గుట్టలో పెద్ద మొత్తంలో రాతి నిల్వలున్నాయి. దీంతో మైన్స్ డిపార్ట్మెంట్ 2018 ఏప్రిల్ 13న ఒక హెక్టారులో మెటల్, స్టోన్ క్వారీ కోసం 15 ఏండ్లకు ఓ వ్యక్తికి, మరో వ్యక్తికి రెండు హెక్టార్లలో పదేండ్లు క్వారీ కోసమని లీజుకు ఇచ్చారు. మొదట్లో సమస్య లేకపోయినా.. ప్రస్తుతం కొండను పొడి చేయడానికి బ్లాస్టింగులు చేస్తున్నారు. కొంతకాలంగా దీనిపై అమ్మాపూర్ గ్రామస్తులు, కురుమూర్తి ఆలయానికి వచ్చే భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్వారీ అనుమతులు రద్దు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం బ్లాస్టింగ్ ధాటికి వేంకటేశ్వర స్వామి కొలువైన దేవతాద్రి గుట్ట దద్దరిల్లుతోంది. దీనిపై పాలక మండలి నోరు మెదపడం లేదు. బ్లాస్టింగ్ చేసినప్పుడల్లా కొండ అదురుతుండటంతో వందల ఏండ్ల చరిత్ర ఉన్న కురుమూర్తి ఆలయంపై ఎఫెక్ట్ పడుతోంది.
వట్టిపోతున్న బోర్లు..
క్వారీకి సమీపంలో అమ్మాపూర్, తిర్మలాపూర్, గూడూరు గ్రామాలున్నాయి. ఈ గ్రామాల పరిధిలో 800 ఎకరాల్లో రైతులు వరి, వేరుశనగ, బత్తాయి తోటలను సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి సాగునీటి కాల్వలు లేకపోవడంతో అందరూ బోర్ల ఆధారంగానే పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 150 వరకు వ్యవసాయ బోర్లున్నాయి. బ్లాస్టింగ్ దెబ్బకు వాటిలో రాళ్లు పడి పూడిపోతున్నాయి. ప్రస్తుతం వరి పంటలకు నీటి అవసరం ఎక్కువగా ఉండడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. క్వారీని బంద్ చేయాలని ఆల్‌పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా ధర్నా చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మైనింగ్ ఏడీ, ఆర్డీవోలు గురువారం క్వారీని పరిశీలించి వెళ్లారు. నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు సమాచారం.
ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే..
రూల్ ప్రకారం ఎక్కడైన పరిశ్రమలు, క్వారీలు ఏర్పాటు చేయాలన్నా, ఆ ప్రాంతంలో అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలి. కానీ అమ్మాపూర్ వద్ద ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే క్వారీకి డపర్మిషన్ ఇచ్చారు. ఇప్పటికే క్వారీతో ఈ ప్రాంతంలో పంటలు దెబ్బతిన్నాయి. దీనికితోడు వెయ్యేండ్ల చరిత్ర ఉన్న ఆలయానికి కూడా ముప్పు ఏర్పడింది. ఈ విషయంపై మైనింగ్ ఏడీ విజయ్ను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
రూ.50 వేలతో పూడిక తీయించిన
నాకు పది ఎకరాల పొలం ఉంది. నిరుడు రూ.60 వేలు ఖర్చు చేసి బోరు వేసిన. ఈ యాసంగిలో పది ఎకరాల్లో వరి వేసిన. ఇప్పుడు పంటకు నీళ్లు అవసరం. క్వారీలో బ్లాస్టింగ్లతో బోరులో ఇసుక చేరి పూడిపోతోంది. నెల కింద రూ.50 వేలు ఖర్చు చేసి పూడిక తీయించిన. మళ్లీ ఇప్పుడు పూడిపోయింది. - గొల్ల అంజన్న, అమ్మాపూర్