చారిత్రక గుట్టకు మైనింగ్ ముప్పు

చారిత్రక గుట్టకు మైనింగ్ ముప్పు
  • నారాయణగిరి నడిమిగోడు గుట్టపై గ్రానైట్ తవ్వకాలకు రెడీ
  • కనుమరుగు కానున్న జైనుల గుహ, శిల్పాలు
  • మైనింగ్​ను వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు, చరిత్రకారులు


హనుమకొండ/ధర్మసాగర్​, వెలుగు: వేల ఏండ్ల చరిత్రకు సాక్ష్యం ఆ ప్రాంతం.  జైనులు, బౌద్ధుల కాలం నాటి ఆనవాళ్లకు నిలువెత్తు నిదర్శనం. అంతటి విశిష్టమైన ప్రాంతం కనిపించకుండా పోయే ప్రమాదం ముంచుకొస్తోంది. నాటి చరిత్రను కండ్లకు కడుతున్న హనుమకొండ జిల్లా ధర్మసాగర్​ మండలం నారాయణగిరి గ్రామ పరిధిలోని బోడగుట్ట, నడిమిబోడు గుట్ట మైనింగ్ బారిన పడబోతోంది. ఈ గుట్టలపై మైనింగ్ మాఫియా కండ్లు పడగా.. అనుమతులిచ్చేందుకు ఇటీవలే గుట్టుగా ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిగింది. గ్రామస్తులెవరికీ సమాచారం ఇవ్వకుండా ఈ తతంగం పూర్తి చేయగా.. చారిత్రక ఆనవాళ్లు ఉన్న గుట్టలను తవ్వి, తమ ఊరికి ముప్పు తేవద్దంటూ నారాయణగిరి గ్రామస్తులు డిమాండ్​ చేస్తున్నారు. గుట్టలతో పాటు తమ ఊరిని కాపాడుకోవాలని ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.

ఘనమైన చరిత్రకు సాక్ష్యాలు ఈ గుట్టలు 

నారాయణగిరి గ్రామానికి వేల ఏండ్ల చరిత్ర ఉంది. ఇక్కడున్న నరసింహస్వామిగుట్ట, బోడగుట్ట, ఎలగుట్టల ప్రాంతంలో ఆదిమానవుని ఆనవాళ్లు ఉన్నట్లు చరిత్రపరిశోధకులు చెబుతున్నారు. కాగా, నారాయణగిరి గుట్టలు జైనులు, బౌద్ధుల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇక్కడ చుట్టూ దట్టమైన చెట్లపొదలుండగా.. బోడగుట్ట, నడిమిబోడు మధ్యలో జైన సన్యాసులు ధ్యానం చేసిన పెద్ద గుహ ఉంది.  ఇందులోని ప్రధాన శిలపై  ధ్యాన ముద్రలో ఉన్న 24వ తీర్థంకరుడు వర్థమాన మహావీరుడి శిల్పం చెక్కి ఉంటుంది.  గుట్ట పైభాగంలో మరోచోట 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడి శిల్పం చెక్కి ఉంది. లింగంబోడుగా పిలిచే గుట్ట భాగంలో  జైన శిలా స్తంభ శాసనాలుండగా..వాటిపై భాగంలో నాలుగు వైపులా తీర్థంకర శిల్పాలు చెక్కి ఉండటం నాటి కళావైభవాన్ని చాటుతున్నాయి. ఇదిలాఉంటే బోడగుట్ట, నడిమిబోడు గుట్టలకు మరొకవైపు బౌద్ధ స్తూపాలు కూడా ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. గుట్టపై భాగం నుంచి నీటి ధార ప్రవహించే జాలు ఉండగా.. అక్కడ ఒకే వరుసలో సప్త మాతృకలు, శివలింగం, నంది, మహిషాసుర మర్ధిని, నాగ దేవత తదితర 18 మంది దేవతల శిల్పాలున్నాయి. దేవతల గుండుగా పిలిచే ఈ ప్రాంతం పక్కనే  మరో చిన్న శిలపై భైరవ శిల్పం ఉండడం గమనార్హం. గుట్టల చుట్టుపక్కల శాతవాహనుల కాలం నాటి  ఇటుక ముక్కల శిథిలాలు కనిపిస్తున్నాయి. ఇంతటి చారిత్రక నేపథ్యమున్న గుట్టలపై సరైన అధ్యయనం జరగకపోగా..ఉన్నవాటినీ కనుమరుగుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ చరిత్రకారుడు రెడ్డి రత్నాకర్​రెడ్డి, తన శిష్య బృందంతో ఈ గుట్టలపై పరిశోధనలు జరిపి తనవంతుగా కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. పాలకులు, ఆఫీసర్లు పెద్దగా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

గుట్టుగా ప్రజాభిప్రాయ సేకరణ

ధర్మసాగర్​ మండలంలో చాలాచోట్ల కలర్​గ్రానైట్​నిక్షేపాలున్నాయి. ఇందులో నారాయణగిరిలోని బోడగుట్ట, నడిమిబోడు గుట్టపై నాణ్యమైన రాయి ఉన్నట్లు గుర్తించిన కొందరు ఇక్కడ గ్రానైట్​ మైనింగ్​ చేపట్టేందుకు అప్లికేషన్​ పెట్టుకున్నారు. గ్రామంలోని  609 సర్వే నంబర్​లో ఉన్న ఈ ప్రాంతంలో గ్రానైట్ తవ్వకాలు జరిపేందుకు  శ్రేయ ఎక్స్​పోర్ట్ , శ్రీమాన్ రాక్స్​ అనే  రెండు కంపెనీలు 20 ఏండ్ల లీజుకు చెరో 15 హెక్టార్ల కోసం 2021లోనే దరఖాస్తు చేసుకున్నాయి. ఈ రెండు కంపెనీలు దాదాపు 70 ఎకరాల్లో  తవ్వకాలు జరపనుండడంతో పర్యావరణ అనుమతులు కావాల్సి వచ్చాయి. దీంతో పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు ఆధ్వర్యంలో పబ్లిక్​ హియరింగ్​నిర్వహించి,  స్థానికుల అభిప్రాయాల మేరకే మైనింగ్​పర్మిషన్​ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు చాటింపు లేదా ఇతర పద్ధతుల్లో గ్రామస్తులందరికీ సమాచారం ఇవ్వాల్సి ఉండగా.. ఆఫీసర్లు, కొందరు లీడర్లు కలిసి ఊర్లో వాళ్లకు సమాచారం చేరకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత  ఈ నెల 23న  దాదాపు 80 మందితో పబ్లిక్​ హియరింగ్​ నిర్వహించగా.. అందులో గ్రామస్తులు కేవలం 12 మంది మాత్రమే హాజరయ్యారు. కాగా, గ్రానైట్​ మైనింగ్​కు గుట్టుగా పర్మిషన్​ ఇచ్చే ప్రయత్నాలు జరిగాయని, ఇందులో అధికార పార్టీకి చెందిన  సర్పంచ్​ తెరవెనుక చక్రం తిప్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉంటే మైనింగ్ ప్రతిపాదిత గుట్ట చుట్టుపక్కల ఆరు కుంటలుండగా.. గ్రానైట్ తవ్వకాలు, బ్లాస్టింగ్స్​ చేపడితే అవి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.  

వణుకుతున్న నారాయణగిరి

గ్రానైట్​ మైనింగ్​ అంటేనే నారాయణగిరి గ్రామం వణుకుతోంది. బోడగుట్ట, నడిమిగుట్టకు ఆనుకుని ఉన్న  తొక్కుడు గుట్టపై ఓ కంపెనీకి మైనింగ్​పర్మిషన్​ఇవ్వడంతో పనులు జరుగుతున్నాయి. దీంతో తరచూ ఇక్కడ బ్లాస్టింగ్​ చేస్తున్నారని, ఆ ప్రభావానికి కిలోమీటర్​ దూరంలోని ఇండ్లన్నీ అదులుతున్నాయని గ్రామస్తులు  ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఉన్న గ్రానైట్ కంపెనీతో ఇబ్బందులు ఎదురవుతుండగా.. ఇప్పుడు మరో రెండు కంపెనీలు వస్తే ఇటు చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవడమే కాకుండా.. ఊరు మొత్తం ధ్వంసమవుతుందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మైనింగ్​పర్మిషన్​పై మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్​ చేశారు. అయినా, ఆఫీసర్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చరిత్రకారులతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. బోడగుట్ట, నడిమిగుట్ట, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పురాతన ఆనవాళ్లను రక్షించడంతో పాటు తమ ఊరికి మైనింగ్​ముప్పు  లేకుండా చూడాలని డిమాండ్​ చేస్తున్నారు. జిల్లా అధికారులు, ప్రభుత్వం  పట్టించుకుని మైనింగ్ పర్మిషన్లు ఇవ్వకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే ఆందోళనలు  చేపడతామని హెచ్చరిస్తున్నారు.

పురావస్తు పరిశోధనలు జరగాలి

నారాయణగిరిలోని గుట్టలపై ఎన్నో చారిత్రక  విశేషాలున్నాయి. బౌద్ధ, జైన, ​శైవ, వైష్ణవ మతాలకు సంబంధించిన ఆనవాళ్లున్నాయి. ఆదిమానవులు, బృహత్​ శిలాయుగం నాటి నాటి గుర్తులున్నాయి. చారిత్రకంగా ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతాన్ని పురావస్తు శాఖ పరిశోధించాలి. గుట్టను పరిరక్షించడంతో పాటు  ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. 
–రెడ్డి రత్నాకర్​రెడ్డి, చరిత్ర పరిశోధకుడు