ఏపీలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వాలంటీర్ వ్యవస్థ ఉనికిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణం. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వాలంటీర్ల గౌరవ వేతనం 10వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అయితే అధికారంలోకి వచ్చిన ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాలంటీర్ల విషయంలో చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
వాలంటీర్ వ్యవస్థ ఉండచ్చు.. ఉండకపోవచ్చు అంటూ 2024, జూన్ 28వ తేదీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాలంటీర్లను అయోమయంలోకి పడేసేలా చేశాయి. ఇప్పటికే వాలంటీర్లకు ఇచ్చే 200 రూపాయల అలవెన్స్ కట్ చేసిన సంగతి తెలిసిందే.
పెన్షన్ పంపిణీ విషయంలో వాలంటీర్లను పక్కన పెట్టి.. సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయించాలని డిసైడ్ అవ్వటంతోనే వాలంటీర్లలో గుబులు మొదలైంది. ఇప్పుడు మంత్రి ఆనం చేసిన వ్యాఖ్యలు మరో షాక్ అని చెప్పాలి. వాలంటీర్ల అవసరం లేకుండానే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందిన సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ జరుగుతోందని స్పష్టం చేశారు. వాలంటీర్ వ్యవస్థతో సంబంధం లేకుండానే.. ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేసి చూపిస్తామని మంత్రి ఆనం చెప్పటం చూస్తుంటే.. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.