కాంగ్రెస్సోళ్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్రు : పువ్వాడ అజయ్ కుమార్

  • ఇండ్లల్లో చొరబడి కండువాలు కప్పడం ఏం సంస్కృతి
  • మధిర బీఆర్ఎస్​నేతల సమావేశంలో మంత్రి అజయ్ ఫైర్

ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​చెప్పారు. గురువారం ఖమ్మంలోని తన నివాసంలో మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. మధిర బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్​రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి అజయ్​మాట్లాడుతూ.. ప్రజల్లోకి వెళ్లి చెప్పుకోవడానికి కాంగ్రెస్​వద్ద ఏమీ లేదని, అధికారంలో ఉన్నప్పుడు ఏమైనే చేస్తే కదా అని ఎద్దేవా చేశారు. ప్రతి గడపకు గడిచిన పదేండ్లలో బీఆర్ఎస్​చేసిన అభివృద్ధి, సంక్షేమం తెలుసున్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు బీఆర్ఎస్​నాయకుల ఇళ్లల్లో చొరబడి కండువాలు కప్పుతున్నారని మండిపడ్డారు. ఇదెక్కడి సంస్కృతి అని ప్రశ్నించారు.

మొన్నటి దాకా గోదావరి జలాలతో పాలేరు ప్రజల కాళ్లు కడుగుతా అన్న వ్యక్తి, ఖమ్మం ప్రజల కాళ్ల కోసం ఎదురుచూస్తున్నారని సెటైర్​వేశారు. మాట మీద నిలకడలేని వ్యక్తి ఖమ్మం ప్రజలకు ఏం చేస్తాడో అర్థం కావట్లేదన్నారు. గడచిన 40 ఏళ్లలో ఆయన చేసిన రాజకీయ హత్యలు అన్నీఇన్ని కావన్నారు. ఒక్కరినైనా రాజకీయంగా పైకి తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రెండోసారి గెలిచిన తర్వాతే తనకు మంత్రి పదవి అవకాశం వచ్చిందని చెప్పారు. ఆ పెద్ద మనిషి బీఆర్ఎస్ ​పార్టీలో ఉన్న టైంలో తనకు మంత్రి పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయాడని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ముదిగొండ ఎంపీపీ సామినేని హరిప్రసాద్, నేతలు పి.పుల్లయ్య, మల్లాది వాసు పాల్గొన్నారు.

నేను పగోడిని కాదు..పనోడిని

తాను పనోడిని అని, పగోడి కాదని పువ్వాడ అజయ్ చెప్పారు. ఖమ్మంలోని శ్రీరక్ష హాస్పిటల్​లో గురువారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పువ్వాడ పాల్గొని మాట్లాడారు. ఖమ్మం సిటీ అభివృద్ధి జరగాలని కోరుకునేవాడిని కాబట్టే ఇంత చేయగలిగానన్నారు. ఖమ్మం వైద్య రంగానికి హబ్ గా మారిందన్నారు. పలువురు కాంగ్రెస్​నాయకులు బీఆర్ఎస్​లో చేరారు. వేర్వేరుచోట్ల ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో అజయ్​పాల్గొన్నారు. అలాగే 17వ డివిజన్ కార్పొరేటర్ ధనాల రాధ, నాయకుడు ధనాల శ్రీకాంత్ తో కలిసి పువ్వాడ అజయ్​సతీమణి వసంతలక్ష్మి ఇంటింటి ప్రచారం చేశారు. 

ALSO READ : జగిత్యాలలో ట్రయాంగిల్​ ఫైట్..ప్రచారంలో దూసుకుపోతున్న మూడు ప్రధాన పార్టీలు