వీ6 న్యూస్ ఛానల్‌కు ధన్యవాదాలు: మంత్రి పువ్వాడ

లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూంల ఇళ్లను కేటాయించారు. అన్ని సదుపాయాలతో ఇళ్లు నిర్మించారు…ఇళ్లకు కరెంటు మీటర్లు బిగించారు. అయితే కనెన్షన్ ఇవ్వడం మాత్రం మరిచారు అధికారులు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం మద్దుల పల్లిలో రెండేళ్ళ క్రితం లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూంలు కేటాయించారు. పవర్ సప్లై చేయడం మరిచిపోయారు. దీంతో అప్పటి నుంచి కరెంట్ లేకపోవడంతో చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఎన్నో సార్లు అధికారులకు తమ కష్టాలను చెప్పుకున్నా పట్టించుకునే వాళ్ళే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడ నివసిస్తున్న ప్రజలు. పక్కనే  ఉన్న పోల్స్ నుంచి కరెంట్ కనెన్షన్ తీసుకుంటే విజిలెన్స్ వారు ఫైన్లు వేస్తున్నారని తెలుపుతున్నారు. ఇదే విషయం వీ6 న్యూస్ ఛానెల్ లో ప్రసారం కావడంతో…వెంటనే స్పందించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. మద్దుల పల్లిలోని డబుల్ బెడ్ రూం ఇళ్లకు కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కథనాన్ని ప్రసారం చేసిన వీ6 న్యూస్ ఛానల్ కు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు ఇకపై అన్ని సౌకర్యాలు పూర్తి చేసిన తర్వాతనే డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకునేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు చెప్పారు మంత్రి పువ్వాడ.