ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు: నిర్మల్ బీఆర్స్ అభ్యర్థిగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫారం అందుకున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో ముథోల్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి, ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్, బోథ్అభ్యర్థి అనిల్ జాదవ్‌కు కూడా సీఎం పార్టీ బీ ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లి విజయం సాధిస్తామన్నారు.
ప్రజలంతా సీఎం కేసీఆర్ వెన్నంటే ఉన్నారని.. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ ల కు ప్రజలను ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి బీఆర్ఎస్ ఎజెండా అన్నారు. సీఎం నుంచి బీఫాం అందుకున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందిస్తానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ మేరకు బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలు, లీడర్లు సంబరాలు జరుపుకున్నారు.
బీఆర్ఎస్ నాయకుల సంబరాలు
బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. బజార్హత్నూర్ మండలంలోనీ బీఆర్ఎస్ కార్యకర్తలు, బోథ్ అభ్యర్థి అనిల్ జాదవ్ అభిమానులు టపాకులు పేల్చుతూ ఆనందం వ్యక్తం చేశారు. నేరడిగొండ మండల కేంద్రంలోని అనిల్ జాదవ్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న ఆయన అభిమానులు టపాకులు పేలుస్తూ , స్వీట్లు పంచి పెడుతూ సంబురాలు జరుపుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బోథ్ గడ్డమీద మూడోసారి గులాబీ జెండా ఎగరేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపీపీ రాథోడ్ సజన్, మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, సర్పంచ్ పెంట వెంకటరమణ, ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సింగపూర్ మాజీ సర్పంచ్ రాజేంద్రపాణి ఆధ్వర్యంలో నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన సంబరాల్లో మాజీ ఎంపీటీసీలు కొండపర్తి శంకర్, గుమ్మడి శ్రీను, మండల సహాయ కార్యదర్శి ఐతరాజు, లీడర్లు కుమ్మం రాజేశ్వర్ రెడ్డి, జంగంపల్లి శేఖర్, రఫీ ఖాన్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.