డిసెంబర్‌‌లో ప్రజా ప్రభుత్వం.. కుటుంబ పాలన అంతమైతది : అమిత్ షా

  • ఆధునిక రజాకార్ల నుంచి తెలంగాణను కాపాడేది బీజేపీనే
  • మజ్లిస్ కనుసన్నల్లో నడిచే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటలే
  • అన్ని వర్గాల సంక్షేమం కోసం కేంద్రం పాటుపడుతున్నది
  • కేసీఆర్ ప్రభుత్వం కొడుకు, కూతురు కోసమే పని చేస్తున్నది
  • లిక్కర్, రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగం, అవినీతిలోనే రాష్ట్రాన్ని నంబర్‌‌‌‌ వన్ చేశారు
  • కేసీఆర్ సర్కార్ జాగ చూపకపోవడం వల్లే గిరిజన వర్సిటీ ఆలస్యం
  • 50 ఏండ్లు దేశాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్‌‌ పని అయిపోందని ఫైర్
  • ఆదిలాబాద్‌‌లో బీజేపీ ‘జన గర్జన సభ’

ఆదిలాబాద్, వెలుగు : తెలంగాణలో డిసెంబర్‌‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కానుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.  కుటుంబ పాలన అంతమవుతుందని చెప్పారు. ‘‘దేశంలో రెండు స్వాతంత్ర్య ఉద్యమాలు జరిగాయి. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఒకటైతే.. తెలంగాణలో నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగింది మరొకటి. ఇప్పుడు ఆధునిక రజాకార్ల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడేది బీజేపీ మాత్రమే’’ అని చెప్పారు. ఆదిలాబాద్‌‌లో మంగళవారం జరిగిన బీజేపీ ‘జన గర్జన సభ’కు అమిత్ షా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని, మజ్లిస్ కనుసన్నల్లో నడిచే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకోవట్లేదని తెలిపారు. డిసెంబర్‌‌‌‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. 

మద్యం అమ్మకాలు, రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగం, అవినీతి, అక్రమాల్లోనే తెలంగాణను నంబర్ వన్‌‌‌‌‌‌‌‌గా కేసీఆర్ చేశారని దుయ్యబట్టారు. తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయడం కోసమే పదేండ్లుగా పరితపించారన్నారు. కేంద్రం అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుంటే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం కొడుకు, కూతురు కోసమే పని చేస్తున్నదని మండిపడ్డారు.

లక్షల కోట్ల అప్పులు చేసిండు

కేసీఆర్ తన పదేండ్ల పాలనలో లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలపై భారం మోపారని అమిత్ షా ఆరోపించారు. దళితులకు మూడెకరాలు, దళిత బంధు, రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల వంటి హామీలు ఇచ్చి ఒక్కటీ పూర్తిగా నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణలో పసుపు బోర్డు, సెంట్రల్ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఇటీవల కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు. గిరిజన వర్సిటీకి కేంద్రం ఆమోదం తెలిపితే.. కేసీఆర్ సర్కార్ జాగ చూపలేదని, అందుకే ఆలస్యమైందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల సమస్య తీర్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. ఆదివాసీ మహిళ ద్రౌపతి ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత తమదేనన్నారు. దేశంలో ఆదివాసీ వీరుల స్మృతిలో రూ.200 కోట్లతో పది చోట్ల మ్యూజియాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిగపారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించామని, చంద్రయాన్ 3 విజయవంతం, జీ20 సదస్సుల నిర్వహణతో దేశ ప్రతిష్ట పెంచామన్నారు. ‘‘కాశ్మీర్ మనదే. ఆర్టికల్ 370 రద్దు వల్ల మేలు జరిగింది. ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్​వ్యతిరేకించడం ఆ పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్నది’’ అని అన్నారు.

కాంగ్రెస్ పని అయిపోయింది..

ఎన్నికలు రాగానే కాంగ్రెస్ లీడర్లు కొత్త బట్టలు వేసుకొని వస్తారని అమిత్ షా ఎద్దేవా చేశారు. కొంత కాలంగా రాహుల్ బాబా తిరుగుతున్నారని విమర్శించారు. 50 ఏండ్లు దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను ప్రజలు నమ్మే   పరిస్థితి లేదని, ఆ పార్టీ పని అయిపోందన్నారు. యూపీఏ హయాంలో ఆదివాసీ సంక్షేమం కోసం రూ.24 వేల కోట్లు కేటాయిస్తే తమ  ప్రభుత్వం వచ్చాక రూ.1.24 లక్షల కోట్లకు పెంచామని తెలిపారు. ఒకప్పుడు దేశంలోకి విచ్చలవిడిగా టెర్రరిస్టులు చొరబడేవారని, ఇప్పుడు శత్రువులు మనవైపు కన్నెత్తి చూడ్డానికే భయపడేలా చేశామన్నారు. దేశ ప్రజల చిరకాల కోరిక అయోధ్యలో రామమందిరం నిర్మాణం 2024 జనవరిలో పూర్తి కాబోతున్నదని చెప్పారు. కాగా, అమిత్​ షా తన ప్రసంగాన్ని బాసర సరస్వతీదేవి, నాగోబా, జైనథ్ లక్ష్మీనారాయణ స్వామిని స్మరించుకుంటూ ప్రారంభించారు. నిజాంపై పోరాడిన కుమ్రం భీం పేరు వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయని గుర్తు చేసుకున్నారు.

ఈసారి తప్పు చేస్తే  మరో 5 ఏండ్ల గోస: సంజయ్

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేటీఆర్ ఏమైనా చేస్తున్నారేమోనని భయంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ‘‘కేసీఆర్ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఏమైంది? ఎందుకు కనబడడం లేదు. కేసీఆర్ నా గురువు. ఆయన దగ్గరే భాష నేర్చుకున్నా. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆయన కొడుకు ఏం చేసిండో అని భయంగా ఉంది’’ అని అన్నారు. తెలంగాణలో రానున్నది నరేంద్రమోదీ రాజ్యమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తప్పు చేస్తే మరో 5 ఏండ్లు గోసపడక తప్పదని హెచ్చరించారు. భారత్ గడ్డపై పాకిస్తాన్ జెండా ఎగరేస్తే ఎన్ కౌంటర్ చేసి పాకిస్తాన్ లోనే పాతిపెట్టే రోజులు రాబోతున్నాయన్నారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అప్పులెట్లా తీరుస్తారు? పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి తెస్తారా? తెలంగాణలో అప్పులు తీరాలన్నా, పేదల బతుకులు మారాలన్నా బీజేపీ అధికారంలోకి రావాలి. బీజేపీ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే మతతత్వ పార్టీ అంటారా?

భైంసా ఘటనను మర్చిపోవాల్నా? హిందూ తమ్ముళ్లపై పీడీ యాక్ట్ లు పెట్టి జైళ్లకు పంపిన సంగతి మర్చిపోతామా? భైంసాలో విధ్వంసం చేసి హిందూ సమాజంపై దాడి చేసిన వారిని బట్టలూడదీసి ఉరికించే మోదీ రాజ్యం రావాలి” అని అన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర పార్టీ ఇన్​చార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కేంద్ర మాజీ మంత్రి హన్సరాజ్ అహిర్, జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వివేక్.. ముందుకు రండి

జన గర్జన సభలో అమిత్ షా ప్రసంగం మొదలు పెట్టే ముందు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సభా వేదికపై కుర్చీలో కూర్చొని ఉన్న వివేక్‌‌‌‌‌‌‌‌ను పిలిచిన షా.. ‘ఇక్కడకి రండి.. ముందుకొచ్చి నిలుచోండి’ అంటూ ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేశారు.