విజయవాడ వరద బాధితులకు అందించిన వరద సాయంపై అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. వరద సాయంపై ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వైసీపీపై ఫైర్ అయ్యారు మంత్రి అనిత. వైసీపీది ఫేక్ బుద్ధి అని.. ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితులకు మొత్తం రూ. 572కోట్లు ఖర్చు చేశామని.. వరదల్లో మొత్తం రూ.602కోట్లు ఖర్చు చేశామని అన్నారు. అవినీతి జరిగి ఉంటే ప్రజలు తమను రోడ్లపై తిరగనిచ్చేవారు కాదని అన్నారు.
విజయవాడ వరదల్లో టీం వర్క్ తో పనిచేశామని అన్నారు. సీఎం చంద్రబాబు కలెక్టరేట్ లో ఉండి వరద సాయం ఎలా జరుగుతుందో పర్యవేక్షించారని అన్నారు. వైసీపీ నేతలంతా మందలాగా వచ్చి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబులా ఏ ముఖ్యమంత్రి వరదల్లో పనిచేయలేదని అన్నారు. జగన్ హయాంలో ఎగ్ పఫులకు ఖర్చు చేసినట్టు తాము చేయలేదని ఎద్దేవా చేశారు అనిత.
Also Read :- సీఎం రేవంత్ రెడ్డితో మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ భేటీ
మరో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. సాక్షి పత్రికలో ఏం రాస్తున్నారో కూడా జగన్ కు తెలియడం లేదని.. ప్రభుత్వం మొత్తం 601 కోట్లు ఖర్చు చేస్తే 534 కోట్లు ఎలా దుర్వినియోగం జరుగుతుందని అన్నారు.ఏదో ఒకసారి వచ్చి చూసి వెళ్లిన జగన్ కు వాస్తవాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.స్వయంగా ముఖ్యమంత్రి నీళ్లలో తిరిగారు..మునిగిన ఇళ్లకు వెళ్లారు..స్వయంగా పరికరాలు డ్యామేజిని పరిశీలించారని అన్నారు.
ఇళ్లు నీట మునిగిన వారికి తమ ప్రభుత్వం 25 వేలు ఇస్తే.. జగన్ రెండు వేలు,నాలుగు వేలు ఇచ్చాడని అన్నారు. వరద బాధితులకు 4 లక్షల 6 వేల కుటుంబాలకు 601 కోట్లు పరిహారం అందించామని స్పష్టం చేశారు. విజయవాడ లో నాలుగు వార్డుల్లో 15 రోజుల పాటు వరద ఉందని.. జగన్ ఇలానే దుష్ప్రచారం చేస్తే రాబోయే రోజుల్లో ఒక్క సీటు కూడా రాదని.. జగన్ కు చివరకు సొంత నియోజకవర్గంలో కూడా సున్న మిగులుతుందని అన్నారు నారాయణ.