కరీంనగర్‌‌‌‌లో ఈఎస్ఐ హాస్పిటల్‌‌ను ఏర్పాటు చేయండి...కేంద్ర మంత్రి మాండవీయకు  బండి సంజయ్ విజ్ఞప్తి

కరీంనగర్‌‌‌‌లో ఈఎస్ఐ హాస్పిటల్‌‌ను ఏర్పాటు చేయండి...కేంద్ర మంత్రి మాండవీయకు  బండి సంజయ్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌‌సుఖ్‌‌ మాండవీయను కలిసి ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం మెడికల్ హబ్‌‌గా మారిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీడీ కార్మికులు, నేత కార్మికులు, సహా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు అధికంగా ఉన్నారని, వీరంతా ట్రీట్‌‌మెంట్‌‌ కోసం కరీంనగర్‌‌‌‌కు వస్తారని తెలిపారు. దీంతో కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం వల్ల స్థానిక కార్మిక కుటుంబాలకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందన్నారు. తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సంజయ్ వెల్లడించారు. త్వరలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారన్నారు.