
హైదరాబాద్, వెలుగు: బీసీ జాబితాలో ముస్లింలను చేరిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, ఈ విషయం తెలిసి కూడా కేంద్రంపై నెపం నెట్టాలనుకోవడం మూర్ఖత్వమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక వీడియోలో మాట్లాడారు.
బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదన్న విషయం దీనితో తేటతెల్లమైందన్నారు. బీసీల్లో ముస్లింలను చేర్చడం వల్ల బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరింత అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ముస్లింలను బీసీల్లో కలిపితే హిందూ సమాజమంతా తిరగబడటం ఖాయమని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే, బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించాలని, ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్కు పోటీచేసే దమ్ము లేదు
స్థానిక ఎన్నికల్లో పోటీచేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదని, ఓటమి భయంతోనే ఎన్నికలు నిర్వహించడం లేదని బండి సంజయ్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఐదేండ్లకోసారి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. మార్చిలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుంటే 15వ గ్రాంట్స్ కమిషన్ నిధులు ఆగిపోతాయన్న విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే రెండు దఫాలుగా గ్రాంట్స్ కమిషన్ నిధులు రాలేదని ఆయన గుర్తుచేశారు.