కేసీఆర్ కొడుకు సుద్దపూస లెక్క వ్యవహరిస్తుండు.. బండి సంజయ్ ఫైర్..

కేసీఆర్ కొడుకు సుద్దపూస లెక్క వ్యవహరిస్తుండు.. బండి సంజయ్ ఫైర్..

కరీంనగర్: కేసీఆర్ కొడుకు సుద్దపూస అయినట్లు నిరుద్యోగులకు బ్రాండ్ అంబాసిడర్ లాగా వ్యవహరిస్తున్నాడని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత  లేదని, సుద్ధపూస లెక్క నిరుద్యోగులకు  మద్దతుగా ఉంటామంటే ఎవరూ నమ్మరని కేటీఆర్పై విమర్శలు చేశారు. గ్రూప్ 1 అభ్యర్థుల మీద విచక్షణ రహితంగా లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు.

ప్రభుత్వమే తప్పు  చేసి, రాజ్యాంగ  విరుద్ధంగా నిరుద్యోగులపై దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్  చేయడం దుర్మార్గమని, ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని హితవు పలికారు. జీవో 29ను వెంటనే రద్దు చేయాలని, ఆ జీవో ఎందుకు  చేశారో  వారికే  తెలియాలని ఎద్దేవా చేశారు. జీవో 29 జారీ  చేయడం చిల్లర  నిర్ణయం అని ఆయన విమర్శించారు. సోమవారం(అక్టోబర్ 21, 2024) జరిగే  పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ALSO READ | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్‌డేట్ : హైకోర్టులో బెయిల్ పిటిషన్

తెలంగాణ వచ్చిన పదేళ్లలో ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం లేదని, కేసీఆర్ ప్రభుత్వం  చేసిందే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని బండి సంజయ్ విమర్శించారు. అవసరం అయితే తానే అశోక్ నగర్ వెళ్తానని ఆయన చెప్పారు. ఈ మినిష్టర్, గినిస్టర్ పదవులు తనకు తర్వాత సంగతని, సమస్య జఠిలం కాబోతుందని, నిరుద్యోగులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. తాము మూసీ ప్రక్షాళనకు గానీ, పునద్ధరణకు గానీ వ్యతిరేకం కాదని, లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెట్టడానికి  తాము వ్యతిరేకమని చెప్పారు. హైడ్రా దృష్టి మళ్లించడానికి మూసీని తెరపైకి తీసుకువచ్చారని బండి సంజయ్ ఆరోపించారు.