పదవులొస్తాయ్​.. పోతాయ్​.. అభివృద్ధే శాశ్వతం : బండి సంజయ్

పదవులొస్తాయ్​.. పోతాయ్​.. అభివృద్ధే శాశ్వతం : బండి సంజయ్
  • కరీంనగర్​లో రాజకీయ విమర్శలు చేయను
  • కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
  • ఎమ్మెల్యే గంగుల, మేయర్ సునీల్ రావుతో కలిసి ‘ఇంటిగ్రేటెడ్  మార్కెట్’కు ప్రారంభోత్సవం

కరీంనగర్, వెలుగు : రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి.. పోతుంటాయని కానీ, చేసిన అభివృద్ధే శాశ్వతంగా నిలిచిపోతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్  పార్లమెంట్  నియోజకవర్గంలో ఇకపై తాను రాజకీయ విమర్శలు చేయదల్చుకోలేదన్నారు. జెండా, ఎజెండాలను పక్కనపెట్టి అభివృద్దే ధ్యేయంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు. కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్  సునీల్ రావుతో కలిసి గురువారం పద్మానగర్ 16వ డివిజన్ లో కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్  మార్కెట్ ను ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్  సిటీ నిధులు వివిధ కారణాలతో పూర్తిగా వినియోగించుకోలేదని, ఇప్పుడిప్పుడే అవన్నీ ఖర్చు చేసి అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. ‘వరంగల్ కు ధీటుగా కరీంనగర్ ను అభివృద్ధి చేసుకుంటున్నం. కేంద్రం నుంచి  తప్పకుండా నిధులు తీసుకొస్తా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం కొట్లాడి సాధించుకుంటాం.' అని పేర్కొన్నారు. 

నేడు 24 గంటల నీటి సరఫరా స్కీమ్  ప్రారంభం.. 

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్  ఖట్టర్  కరీంనగర్ లో 24 గంటల పాటు మంచి నీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వస్తున్నారని, ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని బండి సంజయ్  కోరారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు శ్రీధర్  బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్  కూడా హాజరవుతున్నారని తెలిపారు.