- కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, తనను గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు సేవ చేసేందుకు కష్టపడి చేస్తున్నానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో వివిధ శాఖల హెచ్‌వోడీలతో మంగళవారం ఆయన ఇంటరాక్షన్ సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కలెక్టరేట్ కు వచ్చిన సంజయ్ కి కలెక్టర్ పమేలా సత్పతి సహా ఇతర అధికారులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా శాఖల వారీగా కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న నిధులు, పథకాల అమలు తీరుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మీమీ శాఖల తరఫున కేంద్రం నుంచి కరీంనగర్ కు ఏ ప్రాజెక్టు తీసుకురావచ్చు. ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే అంశాలపై కచ్చితంగా ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను కోరారు. కరీంనగర్ నుంచి హసన్ పర్తి వరకు కొత్త రైల్వే లేన్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు.
ప్రసాద్ స్కీమ్ లో వేములవాడ, కొండగట్టు ఆలయాలను చేర్చడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాజకీయ ఒత్తిళ్లతో మొన్నటివరకు అర్హులైన వారికి కేంద్ర పథకాలు అందలేదని, తాను అవినీతిని ప్రోత్సహించనని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎఫ్‌వో బాలమణి, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఆర్వో పవన్ కుమార్, ఆర్డీవో మహేశ్వర్, అధికారులు పాల్గొన్నారు.