
జమ్మికుంట, వెలుగు: రైతులకు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మోసం చేస్తే పుట్టగతులుండవని, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. శనివారం కేంద్ర వ్యవసాయశాఖ, జౌళిశాఖ సహకారంతో జమ్మికుంట కేవీకేలో నిర్వహించిన అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుపై కిసాన్ మేళాకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్లు చరిత్రలో లేదన్నారు. రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలను మార్చేయగలరన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్‌పీవో వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కేవీకేలు రైతులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటాయన్నారు. తెలంగాణలో 43.76 లక్షల ఎకరాల్లో పత్తి సాగువతుండగా.. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 44,675 ఎకరాల్లో సాగువతుందన్నారు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం గతేడాది 105 మంది రైతులతో 208 ఎకరాల్లో అధిక సాంద్రత పద్ధతిలో సాగుచేయడం ద్వారా కేంద్రం నుంచి ఒక్కో రైతుకు ఎకరాకు రూ.3,500 నుంచి రూ.4,500 ప్రోత్సాహం అందజేసిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను శుద్ధి చేయడం, పరీక్షించడం, క్రమబద్ధీకరించడం, గ్రేడింగ్, ప్రాసెసింగ్ చేయడం వంటి పనులు చేస్తూ వాటి విలువను పెంచి అధిక లాభాలు సంపాదించాలన్నారు. కాగా కిసాన్‌మేళాలో ఓ నాగుపాము ప్రవేశించడంతో కాసేపు రైతులు ఆందోళన చెందారు. కార్యక్రమంలో డీఏవో భాగ్యలక్ష్మి, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ షేక్ మీరా, డాక్టర్ శ్రీలత, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, విజయ్, వేణు, ప్రశాంతి పాల్గొన్నారు.
ఆయుష్మాన్ భారత్ అమలు బాధ్యత రాష్ట్రానిదే
కరీంనగర్ రూరల్, వెలుగు: తెలంగాణలో పక్కాగా ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శనివారం కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో మూడు రోజుల ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాధి నిర్ధారణ, మందుల సరఫరా కౌంటర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఈ స్కీం ద్వారా ట్రీట్‌మెంట్‌కు ప్రైవేట్ హాస్పిటళ్లు నిరాకరిస్తున్నాయన్నారు.
కార్యక్రమంలో మెడిసిటీ హాస్పిటల్ సీఈవో ఇనిష్ మర్చంట్, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, లీడర్లు సంతోష్ కుమార్, రమణారెడ్డి, సుధాకర్, నారాయణ, సత్యం, శ్రీనివాస్, కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు.