ఫోన్ ట్యాపింగ్ కేసును వదిలేది లేదు : భట్టి

 ఫోన్ ట్యాపింగ్ కేసును వదిలేది లేదు : భట్టి
  • త్వరలోనే అన్ని విషయాలు బయటకొస్తయ్: భట్టి 
  • కలెక్టర్ పై కేటీఆర్ కామెంట్లు ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనం
  • ఇంకా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నరు 
  • హైదరాబాద్ స్లమ్స్ లోని మహిళలకు వడ్డీలేని రుణాలిస్తామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు:  ఫోన్ ట్యాపింగ్ కేసును వదిలేది లేదని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నయీం ఆస్తులు, మియాపూర్ భూముల విషయంలో గత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం చేసిన మాదిరి..  డెయిలీ సీరియల్ లా ఫోన్ ట్యాపింగ్ కేసును తాము సాగదియ్యమని చెప్పారు. బుధవారం గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో కలిసి మీడియాతో భట్టి చిట్ చాట్ చేశారు. సిరిసిల్ల కలెక్టర్ పై కేటీఆర్ చేసిన కామెంట్లపై ఆయన మండిపడ్డారు. ‘‘కేటీఆర్ కు కనీస సంస్కారం కూడా లేదు. కలెక్టర్ ను సన్నాసి అంటరా? ఇది ఆయన ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనం. గత కొన్ని రోజులుగా ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా కేటీఆర్ కు అర్థం కావడం లేదు” అని అన్నారు. 

అసైన్డ్ భూముల లెక్కలు తీస్తున్నం.. 

తమ ప్రభుత్వంలోని మంత్రులంతా పనిమంతులేనని భట్టి అన్నారు. బీఆర్ఎస్ నేతల మాదిరి తాము గడీల పాలన చేయడం లేదన్నారు. ‘‘కాంగ్రెస్ లో చేరాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మేం ప్రోత్సహించడం లేదు. వాళ్లే అక్కడ ఇమడలేక గ్రూపులుగా మారి ఆ పార్టీని వీడి మా వైపు వస్తున్నారు. ఇప్పటికీ ఇంకా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు” అని చెప్పారు. ‘‘హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లు కేటాయించాం. త్వరలోనే పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు చేస్తాం. మూసీని అభివృద్ధి చేస్తాం. 

Also Read:-బల్దియా బడ్జెట్ రూ.8,500 కోట్లు?

సిటీలో 300 నుంచి 400 స్లమ్ ఏరియాలను గుర్తించాం. అక్కడ నివాసం ఉంటున్న పేద మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చి, స్వయం ఉపాధి పొందేలా ప్రణాళిక సిద్ధం చేశాం” అని తెలిపారు. ‘‘గతంలో కాంగ్రెస్ హయాంలో పంపిణీ చేసిన 26 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల వివరాలు సేకరిస్తున్నాం. ధరణి వచ్చిన తర్వాత వాటి పరిస్థితి ఏమైందో? ఆరా తీస్తున్నాం. వాటిని తిరిగి అర్హులైన పేదలకు పంచుతాం” అని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. 

త్వరలోనే రైతు భరోసా.. 

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నదని భట్టి అన్నారు. అదే సమయంలో బీజేపీ గ్రాఫ్ తగ్గుతున్నదని చెప్పారు. రైతు భరోసా విధివిధానాలపై కసరత్తు జరుగుతున్నదని, త్వరలోనే రైతు భరోసా అమలు చేస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లకూ త్వరలోనే భూమి పూజ చేస్తామని తెలిపారు. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, అందుకే సర్వే చేస్తున్నామని పేర్కొన్నారు. ‘‘సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వసతి గృహాలను, రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు” అని చెప్పారు. 

క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేయండి

హైదరాబాద్, వెలుగు: ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 200 ప్రాంతాలు, 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేడుకలు నిర్వహించాలని సూచించారు. జీహెచ్​ఎంసీతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కమిటీలు వేయాలన్నారు. క్రిస్మస్ సంబురాల నిర్వహణపై ప్రజాభవన్​లో సెలబ్రేషన్ కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులతో బుధవారం భట్టి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.

 ‘‘ఎల్బీ స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ అవుతారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న అన్ని చర్చిల పెద్దలు పాల్గొనేలా చూడాలి. ఈ మేరకు వారందరికీ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ ఇన్విటేషన్లు పంపాలి. సోషల్ వర్క్, మెడికల్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న సంస్థలకు సీఎం నగదు పురస్కారాలు అందజేస్తారు.

 దీని కోసం సంస్థలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటది. ఈ బాధ్యతలు క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ సబిత చూసుకుంటారు’’అని భట్టి తెలిపారు. రివ్యూ మీటింగ్​లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, స్పెషల్ సెక్రటరీ తఫ్సీర్ ఎక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

15 రోజుల్లో కార్యవర్గం:  పీసీసీ చీఫ్ మహేశ్

పీసీసీ కొత్త కార్యవర్గాన్ని రానున్న 15 నుంచి 20 రోజుల్లో ప్రకటిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  చెప్పారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి అయినా, మంత్రిమండలి అయినా హైకమాండ్ చెప్పినట్టే నడుచుకుంటుంది. మేమంతా మా పార్టీ హైకమాండ్ లైన్ లోనే ఉన్నాం. ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదు” అని అన్నారు. ఈ నెల 30న మహబూబ్ నగర్ లో నిర్వహించనున్న రైతు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.