మందులు లేవని తెలిస్తే.. కఠిన చర్యలు : దామోదర రాజనర్సింహ

మందులు లేవని తెలిస్తే.. కఠిన చర్యలు : దామోదర రాజనర్సింహ
  • ప్రతి జిల్లాల్లో సెంట్రల్ మెడిసినల్ స్టోర్స్, డిస్ట్రిబ్యూషన్ వెహికల్స్ పెట్టాం

హైదరాబాద్, వెలుగు:  మందుల సరాఫరాకు సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మెడిసిన్ లేవనే వార్తలు వస్తున్నాయని, దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ భవన్ లో ఫార్మసీ, ఈ–ఔషధి వర్క్ షాప్ ను మంత్రి దామోదర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడిసిన్‌‌‌‌కు సంబంధించి అందరి సలహాలు, సూచనలు తీసుకున్నామన్నారు. అధికారులు అడిగినట్లు హెచ్‌‌‌‌ఆర్, ఎక్విప్‌‌‌‌మెంట్ అన్నీ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. 

ప్రతి జిల్లాలోనూ సెంట్రల్ మెడిసినల్ స్టోర్స్ ఏర్పాటు చేయడంతో పాటు, మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌కు వాహనాలు సమకూర్చినట్లు తెలిపారు. ఏ మెడిసిన్ కావాలని కోరినా ఇస్తున్నామని, అయినా.. కూడా మందులు లేవనే వార్తలు ఎందుకు వస్తున్నాయని అధికారులను ప్రశ్నించారు. మెడిసిన్ ఎందుకు అందుబాటులో ఉండట్లేదో హాస్పిటల్ సూపరింటెండెంట్లు, ఉన్నతాధికారులు గుర్తించాలని, ఎక్కడైతే నిర్లక్ష్యం జరుగుతుందో, అక్కడ సంబంధిత అధికారి, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫార్మసిస్టులు, డాక్టర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్లు కోఆర్డినేషన్‌‌‌‌తో పని చేయాలని, ఫార్మసీలో అందుబాటులో ఉన్న మెడిసిన్ వివరాలను ఫార్మసిస్టులు డాక్టర్లకు తెలియజేయాలని అన్నారు. సూపరింటెండెంట్లు, ఆర్‌‌‌‌ఎంవోలు ప్రతిరోజూ పొద్దున్నే హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లోని ఫార్మసీ స్టోర్‌‌‌‌ను తనిఖీ చేయాలని ఆదేశించారు. 
.
హెచ్ఎంపీవీ వైరస్ పాతదే

హ్యూమన్‌‌‌‌ మెటానిమో వైరస్‌‌‌‌(హెచ్‌‌‌‌ఎంపీవీ) కొత్తదేమీ కాదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని, నాటి నుంచే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపుతుందన్నారు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుందన్నారు. 

చైనాలో ఈ ఏడాది హెచ్‌‌‌‌ఎంపీవీ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయని  చెప్పారు. విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో, రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు నిరంతరం సంప్రదిస్తూ సమన్వయం చేసుకుంటున్నారని వెల్లడించారు. వైరస్ విషయంలో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని దామోదర రాజ నర్సింహ చెప్పారు.