
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై ప్రజల్లో ఉన్న అపోహలన్నిటినీ తొలగించేందుకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన మేధావులు కృషి చేయాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ కోరారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయని.. వీటితో పాటు ఎస్సీ సబ్ ప్లాన్, భూ పరిరక్షణ చట్టాలు ద్వారా జాతి అభివృద్ధికి దోహద పడుతుందని తెలిపారు.
బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఇన్ జ్యుడీషియరీ ఆధ్వర్యంలో “ఎస్సీ క్లాసిఫికేషన్ ఫర్ సోషల్ జస్టిస్ ’’ అనే అంశంపై మాదిగ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదులు నగరం అంజయ్య, ప్రవీణ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి దామోదర పాల్గొన్నారు. నేషనల్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ధర్మ స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి దామోదర మాట్లాడుతూ..ఎస్సీ వర్గీకరణలో మాదిగ సామాజిక వర్గానికి 9.77 % రిజర్వేషన్లు లభించనున్నాయని తెలిపారు. మాదిగ సామాజిక అనుబంధ కులాలలోని చిన్నచిన్న జాతుల జనాభా అభివృద్ధికి దోహద పడాల్సిన గురుతర బాధ్యత మాదిగ సామాజిక మేధావులపై ఉందని పేర్కొన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అన్నారు. వర్గీకరణ అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకమై రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయాలని సూచించారు.
ధర్మ స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ.. ‘‘ఆనాడు సంత్ రవిదాస్ శిష్యులుగా బాబు జగ్జీవన్ రామ్ ఈ జాతి అభ్యున్నతి కోసం చేసిన సేవలే ఈనాడు వారి శిష్యులుగా ఈ జాతి కోసం ఎస్సీ వర్గీకరణ సాధించి పెట్టిన ఘనత మంత్రి దామోదర్ రాజనర్సింహకు దక్కింది” అని తెలిపారు. కార్యక్రమంలో మాదిగ, మాదిగ అనుబంధం కులాల ఐక్యవేదిక చైర్మన్ మేడి పాపయ్య మాదిగ, ప్రొఫెసర్ మల్లేశం, కొండేటి మల్లయ్య, ముంజగల విజయ్ కుమార్, భీమ్ రావు, మేరీ మాదిగ, కృపాకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.