హైదరాబాద్, వెలుగు : మూసీ నిర్వాసితులను రీహాబిటేషన్ చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. పేద ప్రజల మేలు కోసం చేస్తున్న కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవం పనుల ద్వారా నష్టపోయిన బాధితులందరినీ ఆదుకుంటామన్నారు. ప్రకృతిని కాపాడే విషయంలో రాజకీయాలు వద్దన్నారు. బీఆర్ఎస్ గాలి మాటలు, అబద్ధపు ఆరోపణలు సరికాదన్నారు.
శుక్రవారం మంత్రి దామోదర రాజనర్సింహ సెక్రటేరియెట్ లో మీడియాతో మాట్లాడారు. మూసీని కాపాడుకునే చిత్తశుద్ధి, కమిట్మెంట్ ప్రభుత్వాలకు ఉండాలన్నారు. చెరువులు, నదులను కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రకృతిని కాపాడుకోవాలన్నారు. 2016లోనే గత ప్రభుత్వం మూసీ రివర్ డెవలప్ మెంట్ బోర్డును తీసుకువచ్చి హద్దులు కూడా నిర్ణయించిందన్నారు. కానీ ప్రాజెక్టును ముందుకు తీసుకు పోలేదన్నారు. తమ ప్రభుత్వం ప్రజల కోణంలోనే ఆలోచిస్తుందన్నారు.