- పాలమూరులో స్టేట్‌లెవల్ సైన్స్ ఫెయిర్ ప్రారంభం
మహబూబ్‌నగర్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రయారిటీ ఇస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. స్టూడెంట్లలో దాగి ఉన్న సృజనాత్మకమైన ఆలోచనలను ప్రోత్సహించాలని టీచర్లు, పేరెంట్స్‌కు సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని ఎస్వీకేఎం స్కూల్లో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ ను పిల్లలతో కలిసి ఆయన ప్రారంభించారు. అంతకుముందు 33 జిల్లాల నుంచి వచ్చిన స్టూడెంట్లు ప్రదర్శించిన 861 ప్రాజెక్టులను పరిశీలించారు.
వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలోచనలతోనే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని పేర్కొన్నారు. వాటికి పదును పెట్టి నేషనల్ లెవల్లో స్టూడెంట్లు రాణించేలా టీచర్లు తమవంతు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం గురుకులాలతో పాటు సర్కారు బడుల్లో మెరుగైన సౌలతులు కల్పిస్తోందని తెలిపారు. స్టూడెంట్లు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా ప్రభుత్వం ఉన్నత ప్రమాణాలతో కూడిన ఎడ్యుకేషన్‌ను అందిస్తోందన్నారు. స్టూడెంట్లకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించాలన్నారు.
పిల్లల ఆవిష్కరణలు అబ్బురపరిచాయని హర్షం వ్యక్తం చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ సైంటిస్టుల ప్రదర్శనలు భవిష్యత్ తెలంగాణకు దిక్చూచి కావాలని ఆకాంక్షించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లు ‘కలలు కనాలి వాటిని సాకారం చేసుకోవాలి’ అని అన్నారు. అనంతరం మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో టెన్త్ స్టూడెంట్ల కోసం రూపొందించిన డిజిటల్ కంటెంట్ బుక్‌ను మంత్రి ఆవిష్కరించారు.
విద్యా శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్యేలు జి.మధుసూదర్ రెడ్డి, వాకిటి శ్రీహరి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, లైబ్రరీ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, ఎస్పీ డి.జానకి పాల్గొన్నారు.