- మంత్రి దామోదర్ రాజనర్సింహ
- ఎర్రగడ్డలో జాతీయ ఆయుర్వేద దినోత్సవం
- 628 మందికి యోగా ఇన్ స్ట్రక్టర్లుగా నియామకపత్రాలు
హైదరాబాద్, వెలుగు: ప్రపంచమంతా యోగా, ఆయుర్వేదాన్ని గౌరవిస్తోందని, మనం కూడా ఆ విభాగాన్ని అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దమోదర్ రాజనర్సింహ అన్నారు. 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా హైదరా బాద్ ఎర్రగడ్డలోని ఆయుర్వేద మెడికల్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన 628 మంది పార్ట్ టైమ్ యోగా ఇన్‌స్ట్రక్టర్లకు ఈ సందర్భంగా మంత్రి అపాయింట్‌మెంట్ లెటర్లు అందించారు. ఆయుర్వేదం, యోగా మన వేదజ్ఞానం అని, ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలో పూర్వీకులు మనకు నేర్పించారని తెలిపారు.
ఆ సంప్రదాయాన్ని మనం కొనసాగించాలని కోరారు. ‘‘యోగా, ఆయుర్వేదం మతానికి సంబంధించిన అంశం కాదు. మానవ శరీరం, జ్ఞానం, మనసుకు సంబంధించిన అంశం అది. ఇప్పుడిప్పుడే యోగా, ఆయుర్వేద ప్రాధాన్యాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. పిల్లలకు దీనిని నేర్పించాలి. యోగా, ఆయుర్వేదంను గ్రామాల్లోకి తీసుకెళ్లాలి. యోగా వల్ల కలిగే లాభాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి” అని మంత్రి పేర్కొన్నారు.
ఆయుష్ డైరెక్టరేట్‌ను సాంక్షన్ చేస్తామని, హైదరాబాద్, వరంగల్‌లోని కాలేజీల్లో ఆయుష్ యూజీ, పీజీ సీట్ల సంఖ్యను పెంచుతామని మంత్రి వెల్లడించారు. స్టూడెంట్ల కోసం కొత్త హాస్టల్ భవనాలను నిర్మిస్తామ ని, వారం రోజుల్లో విద్యార్థుల స్టైపెండ్ చెల్లిస్తామన్నా రు.
స్టైపెండ్ పెంపు అంశాన్ని పరిశీలిస్తామని, ఇంకో 214 మంది యోగా ఇన్‌స్ట్రక్టర్లను త్వరలో నియమిస్తామన్నారు. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా మాట్లాడుతూ.. 1935లో ఆయుర్వేద కాలేజీ ఏర్పడిందని గుర్తుచేశారు. 421 ఆరోగ్య మందిరాల్లో యోగా టీచర్లను నియమించామని, ప్రజలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని, పిల్లలకు యోగా అలవాటు చేయాలని సూచించారు. ఆరోగ్య మందిరాల్లో యోగా ఇన్‌స్ట్రక్టర్లు ఉచితంగా యోగా నేర్పిస్తారని వెల్లడించారు.