డాక్టర్లు టైంకు రావాల్సిందే..ఇంటిమేషన్ లేకుండా డుమ్మాకొడితే చర్యలు : మంత్రి దామోదర రాజనర్సింహా

 డాక్టర్లు టైంకు రావాల్సిందే..ఇంటిమేషన్ లేకుండా డుమ్మాకొడితే చర్యలు : మంత్రి దామోదర రాజనర్సింహా
  • ఇకపై రెగ్యులర్​గా హాస్పిటళ్లలో ఆకస్మిక తనిఖీలు 
  •  సమీక్షా సమావేశంలో వైద్య, ఆరోగ్య మంత్రి వెల్లడి 

హైదరాబాద్, వెలుగు:  సర్కారు దవాఖాన్లలో డాక్టర్లు, హెల్త్ స్టాఫ్ సమయ పాలన పాటించాల్సిందేనని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా హెచ్చరించారు. ఆశా వర్కర్ల నుంచి మొదలు టీచింగ్ హాస్పిటల్స్‌‌‌‌లో ప్రిన్సిపాళ్ల వరకూ ఎవరి డ్యూటీ వారు సక్రమంగా నిర్వర్తించాల్సిందేని ఆయన స్పష్టం చేశారు. డ్యూటీలకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవన్నారు.

బుధవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌లో డాక్టర్లు, వైద్య సిబ్బంది సమయపాలన, హాస్పిటల్స్‌‌‌‌లో ఎక్విప్‌‌‌‌మెంట్ నిర్వహణ, అవయవదానం తదితర అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖాన్లపై నమ్మకాన్ని పెంచేలా డాక్టర్లు, సిబ్బంది పనిచేయాలన్నారు.

గాంధీ హాస్పిటల్‌‌‌‌లో ముందస్తు సమాచారం లేకుండా డాక్టర్లు డ్యూటీలకు గైర్హాజరు అవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలని, వారిని చూసి వైద్య సిబ్బంది కూడా బాధ్యతగా ఉంటారన్నారు. అన్ని మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లలో అటెండెన్స్ మానిటరింగ్‌‌‌‌పై మరింత శ్రద్ధ పెట్టాలని డీఎంఈని మంత్రి ఆదేశించారు. అటెండెన్స్ మానిటరింగ్ కోసం ప్రతి కాలేజీలో ఓ సీనియర్ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ను నోడల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా నియమించాలని సూచించారు. హాస్పిటళ్లలో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయన్నారు.  

మెడికల్ కాలేజీల్లో పనులు పూర్తి చేయాలి.. 

రాష్ట్రవ్యాప్తంగా 2022, 2023, 2024లో మూడు దశల్లో ఏర్పాటైన 25 మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ టీచింగ్ హాస్పిటళ్ల నిర్మాణ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. వర్షాకాలంలోగా వీలైనంత వేగంగా ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. హాస్పిటళ్లలో డయాగ్నస్టిక్ ఎక్విప్‌‌‌‌మెంట్ పనితీరుపై సమావేశంలో చర్చించారు.

నిపుణులైన బయోమెడికల్ ఇంజనీర్ల కొరత ఉన్నదని అధికారులు తెలిపారు. బయోమెడికల్ ఇంజనీర్లు, టెక్నీషియన్ల నియమాకానికి చర్యలు తీసుకోవాలని, వారికి ట్రైనింగ్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. ట్రైనింగ్ బాధ్యతలను నిమ్స్‌‌‌‌ బయోమెడికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు అప్పగించాలని ఆదేశించారు. జీవన్‌‌‌‌దాన్‌‌‌‌ పనితీరుపైనా మంత్రి సమీక్షించారు. ప్రభుత్వ దవాఖాన్లలో ఆర్గాన్ ట్రాన్స్‌‌‌‌ప్లాంటేషన్ల సంఖ్య పెంచాలని, ఆరోగ్యశ్రీ కింద ఎక్కువ మంది పేషెంట్లకు అవయవ మార్పిడి చికిత్స చేయాలని సూచించారు.