ఆందోల్​ సెగ్మెంట్​ అభివృద్ధికి ప్రాధాన్యత : దామోదర రాజనర్సింహ

ఆందోల్​ సెగ్మెంట్​ అభివృద్ధికి ప్రాధాన్యత : దామోదర రాజనర్సింహ
  • మంత్రి దామోదర రాజనర్సింహ

రేగోడ్, వెలుగు: ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తానని మంత్రి  దామోదర్  రాజనర్సింహ తెలిపారు. సోమవారం బోరంచ ఎత్తిపోతల పథకం గ్రావిటీ కెనాల్  పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం లింగంపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. 2009లో మంజీరా నీటి మిగులు వాటా తేల్చాకే రూ.21 కోట్లతో లిఫ్ట్  ఇరిగేషన్  పనులను ప్రారంభించి 2013లో పూర్తి చేశామని గుర్తు చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా లిఫ్ట్  ఇరిగేషన్  లక్ష్యం సాధించలేక పోయిందన్నారు.

బోరంచ లిఫ్ట్  ఇరిగేషన్  పథకానికి పూర్వ వైభవం తేవడమే తన లక్ష్యమని, అందులో భాగంగానే రేగోడ్, చౌదర్పల్లి, కొత్వాల్ పల్లి చెరువులు నింపడానికి రూ.7 కోట్లతో గ్రావిటీ కెనాల్  పనులకు శంకుస్థాపన చేశామన్నారు. నాలుగు నెలల్లో లిఫ్ట్  పనులు పూర్తి కావాలని, మార్చి వరకు కొత్వన్​పల్లి చెరువుకు నీళ్లు ఇచ్చే లక్ష్యంతో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆందోల్  నియోజకవర్గంలో రూ.307 కోట్ల రుణమాఫీ చేశామని, మిగిలిన 20 శాతం రుణాలను సైతం త్వరలో మాఫీ చేస్తామన్నారు.

త్వరలో రూ.6 కోట్లతో రేగోడు, మర్పల్లి బ్రిడ్జి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. పుల్కల్  ఆయకట్టుకు సాగునీటిని అందించే కాలువలకు గత ప్రభుత్వం రిపేర్లు చేయించలేదన్నారు. కంకోల్, జోగిపేట్, నిజాంపేటలో ట్రామా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జహీరాబాద్​ ఎంపీ సురేశ్​​షెట్కార్​ మాట్లాడుతూ బీఆర్ఎస్​ ప్రభుత్వం నారాయణఖేడ్​ ప్రాంతానికి సాగునీటిని అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బై ఎలక్షన్​లో హరీశ్​ రావ్​ మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నారే తప్ప చేసిందేమి లేదన్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎత్తిపోతల పథకం చైర్మన్  దిగంబర్ రావు, మున్నూరు కిషన్, యాదగిరి, సంగమేశ్వర్, శ్యాంరావు కులకర్ణి, మన్నె విజయభాస్కర్, మన్నె నరేందర్, చోటుమియా, పత్రి విఠల్, రాజేందర్ పాటిల్, శేషారెడ్డి, రమేశ్ జోషి, నాగేందర్ రావు కులకర్ణి, కృష్ణ  పాల్గొన్నారు.