హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇటీవల ఫుడ్ పాజయిన్ ఘటనలు ఎక్కువయ్యాయి. నగరంలో రోజు ఎక్కడో ఒక చోట ఆహార కల్తీ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల మోమోస్ తిని ఏకంగా ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఫోకస్ పెట్టారు. ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర రాజనర్సింహ.
ఫుడ్ సేఫ్టీపై మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం (నవంబర్ 22) రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ మీద తీసుకుంటున్న చర్యలపై కమిషనర్ ఆర్ వి కర్ణన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహా కీలక ఆదేశాలు జారీ చేశారు. నిరంతరం ఫుడ్ సేఫ్టీపై తనిఖీలు నిర్వహించాలని టాస్క్ ఫోర్స్‌ను ఆదేశించారు.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌లను బలోపేతం చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కుక్‌లకు, ఫుడ్ లాండ్రర్స్కు ఫుడ్ సేఫ్టీ అధికారులు అవసరమైన అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పారు.
స్టేట్ ఫుడ్ సేఫ్టీ విభాగం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి.. హైదరాబాద్‌కు ఉన్న ఫుడ్ బ్రాండ్ నిలిచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చొంగ్తూ, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్, డీఎంఈ డా. వాణీ, రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల తదితరులు పాల్గొన్నారు.