అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తాం : దామోదర రాజనర్సింహ

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తాం : దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి టౌన్, వెలుగు: అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు. శనివారం సంగారెడ్డిలో జరిగిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు. దశాబ్దాలుగా పెండింగ్​లో ఉన్న ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. అత్యంత వెనుకబడిన వారిని ఆదుకోవడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

 ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ మరోవైపు నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా సబ్సిడీ లోన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 500 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్ షెట్కార్, టీజీఐఐసీ నిర్మల జగ్గారెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్,  సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నీటి సంరక్షణ కోసం వాటర్ షెడ్ల ఏర్పాటు 

జహీరాబాద్: నీటి సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో  సంయుక్తంగా వాటర్ షెడ్ పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కోహిర్ మండలం పీచెర్యాగడ్ గ్రామంలో నిర్మిస్తున్న వాటర్ షెడ్ పథకాలను ఎంపీ సురేశ్ షెట్కార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ..వర్షపు నీరు భూమిలోకి ఇంకెలా కందకాలు, చిన్న చిన్న చెక్ డ్యాములు నిర్మిస్తే భూగర్భ జలాలు పెంపొందుతాయన్నారు. 

ఎంపీ సురేశ్​ షెట్కార్ మాట్లాడుతూ  గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కోహిర్ మండలంలోని గొట్టిగార్ పల్లిలో వాటర్​షెడ్​పథకం చేపట్టారన్నారు. దీంతో   9 గ్రామాల రూపురేకలు మారిపోయాయన్నారు. సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో రాంరెడ్డి,  తహసీల్దార్ బాలశంకర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి చంద్రశేఖర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు.