ఆరు గ్యారంటీల అమలుపై బాధ్యత మరిస్తే చర్యలు : దామోదర్ రాజనర్సింహ

ఆరు గ్యారంటీల అమలుపై బాధ్యత మరిస్తే చర్యలు : దామోదర్  రాజనర్సింహ
  • ప్రభుత్వ ఫలాలు ప్రజలకు చేరాలి

సంగారెడ్డి, వెలుగు: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అధికారులు వారధిలా పని చేయాలన్నారు.‌‌ సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి పథకం, క్యాంటీన్ ను బుధవారం వారు ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇందిరా మహిళా శక్తి రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. 

అనంతరం జిల్లాలో ఆరు గ్యారంటీల అమలు, వివిధ శాఖల పనితీరుపై కలెక్టరేట్ లో సమీక్షించారు.  అలాగే విద్య, వైద్యం, తాగునీరు, రుణమాఫీ, కొత్త రుణాల పంపిణీ, చేనేత కార్మికుల సమస్యలు, మున్సిపల్, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, దేవాదాయశాఖ,  నిమ్జ్ భూసేకరణపై సమీక్షించి పనితీరు మెరుగుపరచాలని ఆదేశించారు. మైనింగ్, ఇరిగేషన్, ఎక్సైజ్, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖలకు ప్రభుత్వం సుపీరియల్ పవర్స్ ఇచ్చిందన్నారు. ఆయా శాఖల్లో అక్రమాలకు తావు లేకుండా పని చేస్తున్నట్లు మంత్రి దామోదర తెలిపారు. ఆయా శాఖలపై రెండు నెలలకోసారి సమీక్షలు ఉంటాయని, ఆరు గ్యారంటీల అమలుపై బాధ్యత మరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

దేవాదాయ భూములు పరిరక్షించండి

జిల్లాలో దేవాదాయ భూములు ఆక్రమణకు గురికాకుండా పరిరక్షణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. వన మహోత్సవంలో భాగంగా దేవాలయ భూముల్లో మొక్కలు నాటించాలన్నారు. దేవాదాయ భూములను గుర్తించేందుకు సమగ్ర సర్వే జరిపి హద్దులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీలు రఘునందన్ రావు, సురేశ్ షెట్కార్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మానిక్ రావు, సంజీవరెడ్డి, టీజీఐడీసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, డీసీసీబీ అధ్యక్షుడు చిట్టి దేవేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.