
- అన్ని ఆసుపత్రుల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి: దామోదర
- వీడియో కాన్ఫరెన్స్ద్వారా రివ్యూ సమావేశంలో ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుందని, అన్ని ఆసుపత్రుల్లో పవర్ కేబుల్స్‌ను వెంటనే చెక్ చేయించాలని, అవసరమైన చోట పాత వైర్ల స్థానంలో కొత్త వైరింగ్ చేయించాలని సూచించారు.
ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దామోదర రాజనర్సింహ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండకాలంలోనే ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫైర్ అలారం, స్మోక్ డిటెక్టర్లు ఉండేలా చూసుకోవాలని, సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని సూచించారు.
ప్రతి వార్డులో మంచి నీళ్లు పెట్టాలి
రాష్ట్రంలో ఉష్టోగ్రతలు పెరిగిపోతున్నందున అవుట్ పేషెంట్లకు, ఇన్‌పేషెంట్లకు, హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. అవసరమైన చోట ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఐసీయూలు, అవసరమైన ఇతర వార్డుల్లో ఏసీలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలని సూచించారు. అలాగే ఎండదెబ్బ నివారణకు చర్యలు తీసుకోవాలని, బస్టాండ్లు, ఆసుపత్రులు, ఇతర రద్దీ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. వడదెబ్బ బాధితులకు తక్షణమే చికిత్స అందించేందుకు అవసరమైన మెడిసిన్, ఓఆర్‌ఎస్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.