![వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదు : మంత్రి దామోదర రాజనర్సింహ](https://static.v6velugu.com/uploads/2025/02/minister-damodar-rajanarsimha-promises-to-restore-ambedkar-bhavan-in-lower-tank-bund_8rvljkhize.jpg)
మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు, నేతలతో మంత్రి దామోదర
హైదరాబాద్, వెలుగు: అణచివేయబడిన కులాల్లోని అసమానతలను రూపుమాపేందుకే వర్గీకరణ అని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ అన్నారు. వర్గీకరణ అనేది ఏ కులానికో, వర్గానికో వ్యతిరేకం కాదన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి గడపకూ వర్గీకరణ ఫలాలను తీసుకెళ్లే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని మంత్రి సూచించారు. బుధవారం మినిస్టర్ క్వార్టర్స్ లో మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, లక్ష్మికాంతరావు, విప్ అడ్లూరి లక్ష్మణ్, మందుల సామేలు, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావుతో మంత్రి దామోదర రాజనర్సింహ సమావేశమయ్యారు. దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్షను నెరవేరుస్తున్న సందర్భంగా మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణను ముందుకు తీసుకెళ్లే అంశంపై మంత్రితో వారు చర్చించారు. వర్గీకరణలో అవలంభించిన శాస్త్రీయ పద్ధతులను ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు.
ఇతరులు సృష్టించే అపోహలను, అనుమానాలను నమ్మి ప్రజలు ఆందోళనకు గురికాకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యేలది, మాదిగ సామాజిక వర్గ నాయకులదేనన్నారు. ప్రతి కులానికి న్యాయం చేసేలా వర్గీకరణ ఉందని మంత్రి తెలిపారు. అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్ వన్‌లో, మద్యస్తంగా ఉన్న 18 కులాలను గ్రూప్2లో, కొంత మెరుగ్గా ఉన్న కులాలను గ్రూప్3లో చేర్చాలని కమిషన్ సూచించిందని మంత్రి దామోదర పేర్కొన్నారు. కమిషన్ సూచించినట్టుగా అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా వర్గీకరణ జరుగుతోందన్నారు. వర్గీకరణ విజయోత్సవాల్లో అందరూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు మంత్రి సూచించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ మల్లేశం, పీసీసీ నాయకుడు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ భవన్‌ను పునరుద్ధరిస్తం
లోయర్ ట్యాంక్ బండ్‌లోని అంబేద్కర్ భవన్‌ను పునరుద్ధరిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. తెలంగాణ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 డైరీ, క్యాలెండర్‌ను ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ బాబు ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో మంత్రి ఆవిష్క రించి మాట్లాడారు. దళితులకు ఉపయోగపడే విధంగా చట్టాలను డైరీలో పొందుపరచడం, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ ముఖ్య అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు ఉంచడం మంచి విషయమని తెలిపారు.