- మంత్రి దామోదర రాజనర్సింహ
మహబూబ్ నగర్ కలెక్టరేట్/చిన్నచింతకుంట, వెలుగు: పార్టీలకతీతంగా అర్హత ఉన్న అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. బుధవారం భూత్పూర్ మండలం కొత్త కప్పెట గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సమస్యలు తెలుసుకుని, ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకోవడానికే గ్రామసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
గత పాలకులు ఐదేండ్లుగా పెన్షన్లు, పదేండ్లుగా ఇండ్ల దరఖాస్తులు పెండింగ్ లో పెట్టిందని విమర్శించారు. గతంలో ఇచ్చిన దరఖాస్తులతో పాటు కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ పథకాలు మంజూరు చేస్తామని తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు, ఆర్డీవో నవీన్ పాల్గొన్నారు. అనంతరం దేవరకద్ర పట్టణంలో రూ.35 కోట్లతో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
అత్యవసర చికిత్స అందించేందుకు ప్రతి 40 కిలోమీటర్ల పరిధిలో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జానంపేటలో ట్రామా సెంటర్, చిన్న చింతకుంటలో డయాలిసిస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో కార్డియాలజీ సేవలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
మక్తల్: మక్తల్ మండలం కావ్ వార్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి పాల్గొన్నారు. లిస్ట్‌లో పేర్లు లేని వారు ఆందోళన చెందవద్దని, మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మక్తల్ కు నర్సింగ్ కాలేజీ మంజూరు చేశామన్నారు. అంతకుముందు మక్తల్ లో 150 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఏరియా ఆసుపత్రికి మంజూరైన డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు. వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, డీజీఎంఐడీసీ చీఫ్ ఇంజనీర్ దేవేందర్ కుమార్, ఎస్ఈ సురేందర్ రెడ్డి, ఈఈ జైపాల్ రెడ్డి, డీఈ కృష్ణమూర్తి, ఆర్డీవో రాంచందర్ నాయక్, డీఎంహెచ్‌వో సౌభాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
మదనాపురం: ఆత్మకూరు పట్టణంలో 50 పడకల ఆసుపత్రి భవనానికి మంత్రి దామోదర రాజనర్సింహ భూమిపూజ చేశారు. డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, జి మధుసూదన్ రెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు.
హామీ ఇచ్చిన గంటలోనే..
భూత్పూర్ మండలం కొత్త కప్పెట గ్రామసభలో గ్రామానికి చెందిన దివ్యాంగుడు జ్ఞానేశ్వర్ తనకు ట్రై సైకిల్ ఇప్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశాడు. వెంటనే స్పందించిన మంత్రి ట్రై సైకిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ విజయేందిర బోయి రూ.45 వేలతో ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ ను తెప్పించారు. అదే గ్రామసభలో అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు ట్రై సైకిల్‌ను జ్ఞానేశ్వర్‌కు అంద చేశారు.