తెలంగాణ చరిత్రలో ఇంత దారుణమైన దాడులు ఎన్నడూ జరగలే: మంత్రి రాజనర్సింహ

తెలంగాణ చరిత్రలో ఇంత దారుణమైన దాడులు ఎన్నడూ జరగలే: మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడిపై మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్రలో అధికారులపై ఇంత దారుణమైన దాడులు ఎన్నడూ జరగలేదని.. ఇది కుట్రతో జరిగిన దాడి అని సీరియస్ అయ్యారు. అధికారులపై దాడి తెలంగాణ సంస్కృతి కాదని అన్నారు. లగచర్ల గ్రామస్తుల దాడిలో గాయపడ్డ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకట్ రెడ్డిని ఎల్బీ నగర్ ఆర్కేఆర్ ఎన్ క్లేవ్‎లోని శ్రీహర్ష నిలయంలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. 

ALSO READ | కలెక్టర్‎పై దాడి కేసు: BRS మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో ఇంత దారుణమైన దాడులు ఎన్నడూ జరగలేదని అన్నారు. అధికారులపై దాడి విధానాన్ని బీఆర్ఎస్, ఆ పార్టీ  నాయకులు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏనాడు అధికారులపై ఇలాంటి కుట్రలు కానీ.. దాడులు కానీ చేయలేదని గుర్తు చేశారు. 

దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తోన్న బీఆర్ఎస్ నేతలపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. భవిష్యత్‎లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు నిజంగానే అన్యాయం జరిగే అవకాశం ఉంటే ప్రజాస్వామ్యబద్దంగా ముందుకు వెళ్ళాలని.. అంతేకానీ ఇలా అధికారులపై దాడులకు పాల్పడటం సమంజసం కాదని హితవు పలికారు.