
- వైద్య సేవల బలోపేతానికి సమగ్ర ప్రణాళిక
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ హాస్పిటళ్లలో అధునాతన సౌకర్యాల కల్పనకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లల్లో సరిపడా హెచ్‌ఆర్, ఎక్విప్‌మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రగ్స్, శానిటేషన్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆఫీస్‌లో అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ హెల్త్ డిపార్ట్‌మెంట్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేయాలన్నారు. అన్ని రకాల డయాగ్నస్టిక్ సేవలను పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు.
టూల్స్ అండ్ ప్లాంట్స్ నిర్వహణ కోసం అన్ని హాస్పిటళ్ల సూపరింటెండెంట్లకు నిధులు కేటాయించాలన్నారు. జవాబుదారీతనం ఉండేలా ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఆయా ఆసుపత్రి సూపరింటెండెంట్లపై ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మారుస్తామని వెల్లడించారు. 90 శాతం వైద్య సేవలు జిల్లా స్థాయిలోని ప్రభుత్వ హాస్పిటళ్లలోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.