హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిషేధిత, నకిలీ మందుల సరఫరా, ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రాష్ట్రానికి మందులు సరఫరా చేస్తున్న నిందితులపై 2024లో 573 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసుల సంఖ్య 2023లో కేవలం 56 ఉందన్నారు.
బుధవారం హైదరాబాద్లోని మంత్రి ఇంట్లో డ్రగ్కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన వార్షిక నివేదికను ఆ శాఖ డైరక్టర్ జనరల్ కమల్ హాసన్ రెడ్డితో కలిసి మంత్రి దామోదర ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ను బలోపేతం చేస్తున్నామన్నారు. నకిలీ మందులు తయారు చేసి, సరఫరా చేసే వారిపై కఠినంగా వ్యవహరించి.. అక్రమార్కులపై కేసులు నమోదు చేసిన అధికారులను మంత్రి అభినందించారు. రాష్ట్రంలో డ్రగ్ రాకెట్ నిర్వహించే వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.