ప్రతి నిరుపేదకు లబ్ధి జరిగేలా.. అర్హులను ఎంపిక చేయాలి

  • ఉమ్మడి జిల్లా సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ
  • ప్రచార, సయన్వయ లోపం రావద్దని సూచన
  • ఎమ్మెల్యేలు  గ్రామ, వార్డు సభల్లో పాల్గొనాలి

మహబూబ్​నగర్, వెలుగు: రాష్ట్ర​ప్రభుత్వం జనవరి 26 నుంచి అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్​ కార్డుల జారీ ద్వారా ప్రతి నిరుపేదకు లబ్ధి జరిగేలా అర్హులను ఎంపిక చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. మహబూబ్​నగర్​ కలెక్టరేట్​లో గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన నాలుగు కొత్త స్కీముల అమలుపై సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లాల కలెక్టర్లు, అడిషనల్​ కలెక్టర్లు నాలుగు స్కీములకు సంబంధించి గ్రామ, వార్డు సభల నిర్వహణ, ఆఫీసర్ల టీమ్స్​ ఏర్పాటు వివరాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు..

ఎమ్మెల్యేలు, ఇందిరమ్మ కమిటీలను భాగస్వామ్యం చేయాలి..

మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ నాలుగు స్కీముల అమలులో భాగంగా నిర్వహించే గ్రామ సభల్లో ఎమ్మెల్యేలు, ఇందిరమ్మ కమిటీలను భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ పథకాలపై ప్రచార లోపం, సమన్వయం లోపం ఉండకూడదన్నారు. ఉమ్మడి జిల్లాలో జరిగే గ్రామ సభల్లో తాను, మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొంటామని చెప్పారు. ఐదు రోజుల కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు ఇవ్వాలన్నారు. ఆర్అండ్ఆర్  ప్యాకేజీ కింద ఉన్న వారికి స్కీముల వర్తింపుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు.

Also Read :- సుప్రీంకు బీఆర్ఎస్..10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా

గ్రామ సభల్లో ఎమ్మెల్యేలు పాల్గొనడం ద్వారా సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి విన్నవించే అవకాశం ఉంటుందని చెప్పారు. గ్రామాల వారీగా ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు? ఎన్ని నిధులు మంజూరయ్యాయి? అనే గణంకాలతో కూడిన సమాచారం ఆఫీసర్లు ఎమ్మెల్యేలకు ఇవ్వాలన్నారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేలు పర్యటించిన సమయంలో స్కీములు, నిధులను ఆయా గ్రామాలకు ఎంత కేటాయించారనే విషయాన్ని ప్రజలకు వివరించే అవకాశం ఉంటుందని తెలిపారు.

స్కీములు రాకుంటే నిరాశ చెందవద్దు..

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ‘రైతు ఆత్మీయ భరోసా’ ఒక గొప్ప స్కీం అన్నారు. ఈ పథకం వర్తించని వారు నిరాశ చెందకుండా ఉపాధి పనికి వెళ్లాలని సూచించారు. మరోసారి అప్లికేషన్​ చేసుకునే విధంగా ఆఫీసర్లు అవగాహన కల్పించాలన్నారు. ఈ పథకం గురించి ఫీల్డ్  అసిస్టెంట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. సొంత స్థలం లేని వారికి మలి దఫాలో ఇండ్లు  వస్తాయని జాగా లేని నిరుపేదలకు సర్ది చెప్పాలని సూచించారు.

కర్నాటక నుంచి జూరాలకు నీటిని తెప్పించండి..

మక్తల్​ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ పక్కనే ఉన్న కర్నాటకలో కాంగ్రెస్  ప్రభుత్వమే అధికారంలో ఉందని అక్కడి ప్రభుత్వంతో చర్చించి జూరాలకు ఐదు టీఎంసీల నీటిని వదిలేలా చూడాలని కోరారు. క్షేత్రస్థాయిలో సర్వే జరిగిన చోటే స్క్రూటినీ చేయాలన్నారు. 

ఇండ్లు ఉన్న వారిని అర్హుల జాబితా నుంచి తొలగించాలన్నారు. ఆర్అండ్ఆర్  సెంటర్​లో ఉన్న పేదలకు ఇండ్లు మంజూరు చేయాలన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​ రెడ్డి మాట్లాడుతూ కొత్త స్కీముల అమలులో అర్హుల ఎంపిక సమర్థవంతంగా జరగాలని కోరారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్​ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారికి ఈ స్కీముల వర్తింపులో అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. 

నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్​రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ఇందిరమ్మ ఇండ్లను అడుగుతున్నారని, ఈ విషయాన్ని పరిశీలించాలన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల స్కీములో టెక్నికల్, ప్రాక్టికల్  సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో ఫిల్టర్  చేసిన జాబితాను గ్రామ సభలో పెట్టాలని కోరారు. కాగా, ఎస్సీ నియోజకవర్గంలో ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని అలంపూర్  ఎమ్మెల్యే విజయుడు కోరారు. సమీక్షలో మైనార్టీ కార్పొరేషన్  చైర్మన్  ఓబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, స్పెషల్​ ఆఫీసర్​ రవి, డీసీసీబీ చైర్మన్  మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, కలెక్టర్లు విజయేందిర బోయి, బదావత్​ సంతోష్, ఆదర్ష్ సురభి, సంతోష్  పాల్గొన్నారు.

పకడ్బందీగా అమలు చేయాలి..

ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ఈ నాలుగు స్కీములను ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అర్హుల ఎంపికకు క్షేత్ర పరిశీలన, గ్రామ సభల నిర్వహణలో ఆఫీసర్లు, లీడర్లు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయ యోగ్యం కాని భూములను పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో నిశితంగా సర్వే చేయాలన్నారు.

గూగుల్  మ్యాపింగ్  ద్వారా సర్వే చేస్తున్నారా? లేదా? అని ప్రశ్నించారు. రూల్స్​కు విరుద్ధంగా ఏం చేయవద్దని స్పష్టం చేశారు. కొత్త స్కీముల అమలులో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని ఓ గ్రామంలో రేషన్ కార్డుల అప్లికేషన్లలో వ్యత్యాసం వచ్చిందని మంత్రి గుర్తు చేశారు. గ్రామాల్లో సభలకు సంబంధించి ఒక రోజు ముందు టామ్ టామ్  వేయించాలని మంత్రి సూచించారు.