- 500 పడకలుగా పెంచుతున్నట్లు మంత్రి దామోదర ప్రకటన
- డీఎంహెచ్ వో పై సీరియస్ అయిన మంత్రి
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి స్థాయిని 500 పడకలకు పెంచుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గురువారం ఆయన ఆస్పత్రిని తనిఖీ చేశారు. మెడికల్, నర్సింగ్ కాలేజ్ లు, హాస్టల్స్ భవన నిర్మాణాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు. నిర్మాణ పనులు ఆలస్యంగా జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనులు స్పీడప్చేయాలని కాంట్రాక్టర్, ఆర్అండ్ బీ అధికారులను ఆదేశించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలు, హాస్టల్స్ బిల్డింగులు నాలుగు నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఆస్పత్రిలో డయాలసిస్, పెడియాట్రిక్ బెడ్స్ ను సైతం పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజలు ప్రైవేట్ దవాఖానాలకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తారని, ప్రైవేట్ కు వెళ్లి ఇబ్బందులు పడొద్దన్నారు.
డీఎంహెచ్ వోపై మంత్రి సీరియస్
ఆస్పత్రిలో ఉద్యోగ నియామకాలపై డీఎంహెచ్ వోపై మంత్రి దామోదర సీరియస్ అయ్యారు. ఆస్పత్రుల్లో సిబ్బంది తక్కువగా ఉన్నందున డిప్యూటేషన్ ఇవ్వాలని డీఎంహెచ్ వో గాయత్రిదేవి మంత్రిని కోరారు. అందుకు స్పందించిన ఆయన డిప్యూటేషన్ నియామకాలు ఏంటని ప్రశ్నించారు. ఆస్పత్రులకు అవసరమైన సిబ్బందిని ఎన్ హెచ్ఎం ద్వారా రిక్రూట్మెంట్ చేసుకోవాలన్నారు.
అవసరం ఉంటే కొత్తగా పోస్టులు భర్తీ చేసుకోవాలని అందుకు ప్రభుత్వం కొత్త పోస్టులకు అవకాశం ఇస్తుందన్నారు. డిప్యూటేషన్లు అసలే వద్దు పర్మనెంట్ సిబ్బందిని నియమించుకోవాలన్నారు. సంగారెడ్డిలో ఆయూష్ ఆస్పత్రి అవసరం ఉందా అని డీఎంహెచ్ వోను మంత్రి అడుగగా అవసరం లేదని బదులిచ్చారు. దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సంగారెడ్డి ఆస్పత్రికి ప్రతి రోజు 40 నుంచి 50 మంది పేషెంట్లు వస్తుండగా ఎందుకు వద్దంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. 15 రోజుల్లో ఆయూష్ ఆస్పత్రిని ప్రారంభిస్తామన్నారు. ఆ తర్వాత మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
సీఎస్ఆర్ ఫండ్స్ పై సమీక్ష
అనంతరం కలెక్టరేట్ లో జిల్లాలోని వివిధ పరిశ్రమల ప్రత్యేక అధికారులతో సీఎస్ఆర్ నిధుల వినియోగంపై మంత్రి కలెక్టర్ తో కలిసి సమీక్షించారు. సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ క్రాంతి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ వాణి, ఆస్పత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్, ఆర్ అండ్ బీ అధికారులు, కాంట్రాక్టర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.