- రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని వెల్లడి
- ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి
- కోఠిలోని మెడికల్ కాలేజీలో హాస్టల్ బిల్డింగ్స్‌కు శంకుస్థాపన
- పాల్గొన్న మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ బల్మూరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా అనేది ఓ బ్రాండ్ అని, ఆ బ్రాండ్ ఇమేజ్‌ను విస్తరిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మరో రెండు నెలల్లో ఉస్మానియా కొత్త హాస్పిటల్ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడికోల హాస్టల్ భవనాలకు శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజనర్సింహ మాట్లాడుతూ.. ఉస్మానియా అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే ఉస్మానియా అని, దేశంలో ఎక్కడికి వెళ్లినా ఉస్మానియాను గుర్తిస్తారని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం ఉన్న ఉస్మానియా హాస్పిటల్ భవనాలను అలాగే ఉంచి, గోషామహాల్‌లో సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త హాస్పిటల్ నిర్మిస్తామని తెలిపారు. సుమారు రూ.2 వేల కోట్లతో ఆధునిక సౌకర్యాలతో కొత్త దవాఖాన ఉంటుందన్నారు. విద్య, వైద్య రంగాలు తమ ప్రభుత్వానికి ప్రాధాన్య అంశాలని, ఈ రంగాల్లో అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న హాస్టల్ భవనాలు, ఉస్మానియా కొత్త హాస్పిటల్ మంజూరు చేశామని, ఇంకేమైనా అవసరాలు ఉన్నా తీరుస్తామన్నారు. ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపర్చేందుకు సూచనలు ఇస్తే వినేందుకు తాము సిద్ధంగా ఉంటామన్నారు.
ప్రజలు గుడికి ఎంత నమ్మకంగా పోతారో, హాస్పిటల్‌కు కూడా అంతే నమ్మకంగా వస్తారని, దేవున్ని నమ్మినట్టే, డాక్టర్లను నమ్మి వారు చెప్పే నియమాలను పాటిస్తారని మంత్రి గుర్తు చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని డాక్టర్లకు సూచించారు. డాక్టర్లు తమ కంఫర్ట్ గురించి మాత్రమేకాకుండా, పేషెంట్ కంఫర్ట్ గురించి కూడా ఆలోచించాలన్నారు. ప్రైవేటు హాస్పిటళ్లలో కంటే నిష్ణాతులైన డాక్టర్లు ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేస్తున్నారన్నారు. ప్రైవేటు హాస్పిటళ్లతో పోటీ పడేలా ప్రభుత్వ దవాఖాన్లను తయారు చేయాలని డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా, గాంధీ వంటి దవాఖాన్లకు నష్టం చేస్తే సమాజానికి ద్రోహం చేసినట్టేనన్నారు.
విద్య, వైద్యం విషయంలో రాజకీయాలకు అతీతంగా ఉండాలని, అలాగే ఉంటామని మంత్రి తెలిపారు. ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో హాస్టల్ బిల్డింగుల కోసం రూ.121 కోట్లు కేటాయించడం చిన్న విషయం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వపరంగా తాము చేయాల్సిందంతా చేస్తామని చెప్పారు. పదేండ్లుగా పరిష్కారం కాని సమస్యలను, పది నెలలు తిరగకముందే తమ ప్రభుత్వ పరిష్కరిస్తున్నదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. గతంలో ధర్నాలు చేస్తే బెదిరింపులు, అరెస్టులు చేసేవారని, ఇప్పుడు ధర్నా ఎందుకు చేస్తున్నారో తెలుసుకుని సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ఉస్మానియా పేరును ప్రపంచానికి చాటేలా డాక్టర్లు, సిబ్బంది పనిచేయాలని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
నెరవేరిన 8 ఏండ్ల కల
ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన మరో కార్యక్రమంలో కొత్తగా రిక్రూటైన 285 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు మంత్రులు దామోదర, పొన్నం అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. డాక్టర్లు సరైన ట్రీట్‌మెంట్ అందించాలంటే రోగ నిర్ధారణ కీలకం అని, ఆ నిర్ధారణ చేసే ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర అత్యంత కీలకమని మంత్రులు పేర్కొన్నారు. ప్రస్తుతం 282 మందికి నియామక పత్రాలు అందజేశామని, ఏడాదిలో మరో 1,300 మంది ఎల్టీలను రిక్రూట్ చేస్తామన్నారు.
ప్రస్తుతం నియామక పత్రాలు అందుకున్న 282 మంది 2017 నుంచి ఇందుకోసం ఎదురుచూశారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి 2017లో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా, కోర్టు కేసులతో అది వాయిదా పడుతూ వచ్చింది. కొత్త సర్కార్ వచ్చాక కోర్టు కేసులను క్లియర్ చేసి, రిక్రూట్‌మెంట్ పూర్తి చేసిందని ల్యాబ్ టెక్నీషియన్లు తెలిపారు.