ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మకం.. 30 ఏండ్ల ఇష్యూకు పరిష్కారం.. అమలులోకి వర్గీకరణ: మంత్రి దామోదర

ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మకం.. 30 ఏండ్ల ఇష్యూకు పరిష్కారం.. అమలులోకి వర్గీకరణ: మంత్రి దామోదర
  • మీడియాతో కేబినెట్​ సబ్​ కమిటీ చైర్మన్​ ఉత్తమ్​ వెల్లడి
  • సీఎంకు గెజిట్​ నోటిఫికేషన్​, జీవో కాపీల అందజేత
  • జనగణన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల పెంపు
  • ఇక నుంచి భారీగా ఉద్యోగాల భర్తీ
  • పదేండ్లలో ఎస్సీ వర్గీకరణను బీఆర్​ఎస్​ ఎందుకు చేయలే?
  • మోసం, దగాకు పేటెంట్​ కేటీఆర్​ అని మంత్రి ఉత్తమ్​ ఫైర్​
  • వర్గీకరణ ఏ కులానికీ వ్యతిరేకం కాదు

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి రోజు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్, జీవోలు ఇవ్వటం చరిత్రాత్మక ఘట్టమని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 30 ఏండ్ల  నుంచి ఈ సమస్య పరిష్కారం కోసం అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నా ముందుకు వెళ్లలేదని, కేవలం అసెంబ్లీలో చర్చకే పరిమితమయ్యాయని తెలిపారు. తమ కాంగ్రెస్​ ప్రభుత్వం మాత్రమే వర్గీకరణను తీసుకొచ్చిందని ఆయన చెప్పారు. సోమవారం సెక్రటేరియెట్​లో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ​వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ జస్టీస్ షమిమ్ అక్తర్, ఎంపీ బలరాం నాయక్, ఎస్సీ డిపార్ట్​మెంట్​ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్​తో కలిసి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. 

అంతకు ముందు సీఎం రేవంత్​రెడ్డిని   కేబినెట్​ సబ్​ కమిటీ కలిసి.. ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్, జీవో కాపీలను అందజేసింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం నుంచే ఎస్సీ వర్గీకరణ అమలులోకి వస్తున్నదని మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్​ వెల్లడించారు. వర్గీకరణ అమలుపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే అసెంబ్లీలో సీఎం రేవంత్​రెడ్డి  ప్రకటన చేశారని, ఆపై తనను  చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి, వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారని వివరించారు. ‘‘59 ఉప కులాల్లో ఎవరు వెనుకబడి ఉన్నారనే అంశంపై వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేశాం. 

ఈ కమిషన్ చైర్మన్ గా జిల్లా జడ్జి నుంచి హైకోర్టు జడ్జి వరకు పనిచేసిన జస్టిస్ షమీమ్ అక్తర్ ను నియమించాం. ఈ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ, వన్ మ్యాన్ కమిషన్ కొన్ని వేల వినతిపత్రాలు స్వీకరించాయి. ప్రధానంగా వర్గీకరణపై పంజాబ్, తమిళనాడులో ఉన్న పరిస్థితులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాం. అతి తక్కువ సమయంలోనే జస్టిస్  షమిమ్ అక్తర్ రిపోర్ట్ ఇచ్చారు. దీంతో 3 గ్రూపులుగా ఎస్సీ లను డివైడ్ చేశాం. అసెంబ్లీ,  కౌన్సిల్ ఆమోదించిన బిల్లును కేబినెట్ ఆమోదించింది. 

గవర్నర్​ కూడా ఆమోద ముద్ర వేశారు. ఈ ప్రక్రియంతా కేవలం 8నెలల్లోనే పూర్తి చేసి, వర్గీకరణ పై జీవో 33 విడుదల చేశాం. అలాగే, అంబేద్కర్​ జయంతి సందర్భంగా జీవో 9, జీవో 10ను విడుదల చేస్తున్నాం. ఆయా జీవోలు పబ్లిక్ డొమైన్ లో ఉంచాం” అని మంత్రి ఉత్తమ్​ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు చేసిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నదని తెలిపారు. 

‘‘నా జీవితంలో ఈరోజు మర్చిపోలేనిది” అని మంత్రి ఉత్తమ్​ పేర్కొన్నారు.  కాంగ్రెస్​పార్టీ అగ్రనేత రాహుల్​ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కుల గణన చేపట్టామని, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కారించామని చెప్పారు. ఈ రెండు కీలక నిర్ణయాలు అమలు చేయడం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందనటానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 

మోసం, దగాకు పేటెంట్​ కేటీఆర్​

చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ అమలు చేయటం లేదని కేటీఆర్ ఆరోపిస్తున్నారని మీడియా ప్రశ్నించగా.. ఉత్తమ్ స్పందించారు. ‘‘హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఉండటం.. మోసం, దగాకు పేటెంట్​ కేటీఆర్” అని ఆయన మండిపడ్డారు. పదేండ్లు అధికారంలో ఉండి ఎస్సీ వర్గీకరణను బీఆర్​ఎస్​ ఎందుకు చేయలేదని నిలదీశారు. 

జీవో కాపీలు అందజేసి.. స్వీట్లు తినిపించి..

సోమవారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్ రెడ్డిని కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్​, సభ్యులు కలిశారు. ఎస్సీ వర్గీకరణపై గెజిట్ నోటిఫికేషన్, జీవో కాపీలను ముఖ్యమంత్రికి అందజేసి, స్వీట్లు తినిపించారు. కేబినెట్ సబ్ కమిటీని సీఎం ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ , ఎంపీలు అనిల్​కుమార్ యాదవ్,  బలరాం నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎస్సీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి పాల్గొన్నారు. 

వర్గీకరణ ఏ కులానికీ వ్యతిరేకం కాదు: మంత్రి దామోదర

ఎస్సీ వర్గీకరణ ఏ కులానికీ వ్యతిరేకం కాదని.. దళితుల్లో ఉన్న అంతర్గత వెనుకబాటుతనం, అసమానతలను తొలగించేందుకేనని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా, దళితులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘‘సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పరితపించిన అంబేద్కర్ జయంతి రోజు వర్గీకరణ ఆకాంక్ష సంపూర్ణంగా నెరవేరడం సంతోషకరం” అని తెలిపారు.  

సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి  దార్శనికత, కమిట్‌‌‌‌మెంట్ వల్లే వర్గీకరణ ఆకాంక్ష ఇంత త్వరగా సాకారమైందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన ఎనిమిదిన్నర నెలల కాలంలోనే వర్గీకరణ అమల్లోకి తీసుకొచ్చిన తొలిరాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నదని చెప్పారు.   2013లో సమైక్య రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఎస్సీ సబ్ ప్లాన్ చేసే అవకాశం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను సీడబ్ల్యూసీలో‌‌‌‌ సోనియాగాంధీ సహా కాంగ్రెస్ నాయకత్వానికి, నాటి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వినిపించే అవకాశం దక్కడం, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశంలో భాగమయ్యే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి దామోదర తెలిపారు. 

ఇక పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీ

ఎస్సీ వర్గీకరణ అంశం పరిష్కారమయ్యే వరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వబోమని చెప్పామని, వర్గీకరణ ఇష్యూ పరిష్కారమైనందున ఇక నోటిఫికేషన్లు వస్తాయని తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలపై  మంగళవారం  సీఎస్, ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ తోపాటు ఉన్నతాధికారులతో మీటింగ్ నిర్వహించి,  ఖాళీల వివరాలు తీసుకుంటామని  మంత్రి ఉత్తమ్  చెప్పారు. ఇప్పటి  నుంచి పెద్ద సంఖ్యలో ఖాళీలు భర్తీ చేయబోతున్నామని ఆయన వెల్లడించారు. అన్నింటికి కూడా వర్గీకరణ వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. జీవో నంబర్ 29 ప్రకారం రోస్టర్ పాయింట్స్ కేటాయింపు కూడా ఉంటుందని స్పష్టం చేశారు.