ఎస్సీ కులాల్లో సమానత్వం కోసమే వర్గీకరణ: మంత్రి దామోదర

ఎస్సీ కులాల్లో సమానత్వం కోసమే వర్గీకరణ: మంత్రి దామోదర
  • సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేసినం
  • తీర్పు వచ్చిన ఆరునెలల్లోనే బిల్లును ఆమోదించినం 
  • సీఎం రేవంత్​రెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారని వెల్లడి
  • అసెంబ్లీలో వర్గీకరణ బిల్లుపై మంత్రి ప్రసంగం

హైదరాబాద్, వెలుగు:షెడ్యూల్డ్ కులాల నడుమ సాధికారత, సమానత్వం కోసమే వర్గీకరణ చేస్తున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే  సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో ప్రకటన చేశారని గుర్తుచేశారు. దేశంలో వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని అప్పట్లో ప్రకటించారని, ప్రస్తుతం ఆ మాటను నిలుపుకొన్నారని చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై  మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడారు. 

దళితుల దశాబ్దాల వర్గీకరణ కలను నెరవేరుస్తున్న లీడర్ సీఎం రేవంత్ రెడ్డి అని,  సీఎంతోపాటు బిల్లుకు సహకరించిన కేబినెట్ సబ్‌‌‌‌‌‌‌‌కమిటీ చైర్మన్ ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి, ఇతర సభ్యులకు  కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయ సాధికారతకు బాటలు వేస్తున్నారని, కులగణన, బీసీల రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ అంశాలే ఆయన దార్శనికతకు తార్కాణమని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ కొత్తది కాదని, స్వాతంత్ర్యం వచ్చిన 15 ఏండ్లకే మొదలైందని గుర్తు చేశారు. వర్గీకరణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయని, ఎంతో మంది త్యాగాలు చేశారని అన్నారు.  

అంబేద్కర్​ వల్లే రిజర్వేషన్లు

1931లోనే తొలిసారి కుల గణన చేశారని, 1936లో షెడ్యూల్డ్ కులాల జాబితాను ప్రకటించారని మంత్రి దామోదర  తెలిపారు. అంబేద్కర్ పోరాట ఫలితంగా దళితులకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 1990వ దశకం నాటికి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఉధృతమైందని, దీంతో అప్పటి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు నేతృత్వంలో 1996లో కమిషన్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసిందని వివరించారు. వెనుకబాటుతనం, జనాభా, చారిత్రక నేపథ్యం ఆధారంగా షెడ్యూల్డ్ కులాలను 4 గ్రూపులుగా వర్గీకరించి, రిజర్వేషన్లు అమలు చేయాలని కమిషన్ సూచించిందని గుర్తుచేశారు. 

కమిషన్ సూచనల మేరకు 2000 సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాలను ఏ, బీ, సీ, డీ  గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు అమలు చేశారని తెలిపారు. అయితే, కోర్టు కేసులు, సుప్రీంకోర్టు తీర్పుతో 2004 నుంచి వర్గీకరణ ఆగిపోయిందన్నారు.  నిరుడి వరకూ వర్గీకరణ కేసుపై సుప్రీంకోర్టు లో విచారణ కొనసాగిందని వివరించారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న వర్గీకరణ కేసులో..  అనుకూలంగా వాదించేందుకు ప్రభుత్వం తరఫున సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ను నియమించామని, అనంతరం గతేడాది ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తుది తీర్పును ప్రకటించిందని వివరించారు.

సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించి, వర్గీకరణను అమలు చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని నియమించామని తెలిపారు.  ఎస్సీ వర్గీకరణ కోసం రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ జడ్జి జస్టిస్​ షమీమ్ అక్తర్ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా వన్ మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్‌‌‌‌‌‌‌‌ను  ఏర్పాటు చేశామని మంత్రి దామోదర తెలిపారు. ఈ కమిషన్​ 10 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నదని వివరించారు. 4 గ్రూపులుగా వర్గీకరించే స్థాయిలో షెడ్యూల్డ్ కులాల మధ్య తేడాలు లేనందున, 3 గ్రూపులుగా వర్గీకరించి, రిజర్వేషన్లు అమలు చేయాలని కమిషన్ సూచించిందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కొత్తగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని కోరుకునేవారంతా బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

ఇది కాంగ్రెస్​ కమిట్​మెంట్​

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 6  నెలల్లోనే వర్గీకరణ చట్టం తీసుకొస్తున్నామని, ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. 2025 ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్​ డే, మార్చి 18వ తేదీలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. గతంలో ఓ సారి వర్గీకరణ చేసినా.. కోర్టు తీర్పులతో అది నిలిచిపోయిందని, నాటి వర్గీకరణకు, నేటి వర్గీకరణకు పెద్దగా తేడా లేదని వివరించారు.  కేవలం1.78 లక్షల జనాభా ఉన్న 26 కులాలు మాత్రమే ఇతర గ్రూపుల్లో చేర్చబడ్డాయని  పేర్కొన్నారు. 

మాదిగల్లో ఈ 26 కులాల జనాభా 3.43 శాతమేనని, మిగిలిన 33 కులాలు పాత గ్రూపుల ప్రకారమే కొనసాగుతున్నాయని చెప్పారు. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ, ఆత్మగౌరవం కోసం మహాత్మా జ్యోతిబాఫూలే, మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు ఎందరో పోరాటాలు చేశారని వివరించారు.