- మంత్రి దామోదర రాజనర్సింహ
- డీఎస్సీ సెలెక్టెడ్ అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేత
పుల్కల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అన్ని హంగులతో ఇంటిగ్రేటేడ్ స్కూళ్ల ను నిర్మిస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్గ్రామ శివారులో ప్రభుత్వం మంజూరు చేసిన యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్భవన నిర్మాణానికి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్ తో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. అందోల్ నియోజకవర్గంలో రూ.125 కోట్లు, 33 ఎకరాల్లో అన్ని హంగులతో ఈ స్కూల్ భవనం నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రపంచస్థాయి విద్యాప్రమాణాలతో 2500 మంది విద్యార్థులు చదువుకునే వీలుందన్నారు. డీఎస్సీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంత్రి రాజనర్సింహ నియామక పత్రాలు అందజేశారు.
సింగూర్ నుంచి జాతీయరహదారి తాడ్దాన్పల్లి వరకు రోడ్డు మంజూరు చేయాలని ఓ విద్యార్థిని కోరగా మంత్రి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు దుర్గారెడ్డి, ఉపాధ్యక్షుడు అంజయ్య, డీసీఎంఎస్ డైరెక్టర్ రాంచంద్రారెడ్డి, నాయకులు లక్ష్మారె డ్డి, గోవర్ధన్, ఈశ్వర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
నారాయణ్ ఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని తెలంగాణ హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ అన్నారు. బుధవారం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి మాట్లాడారు.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో 150 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను నిర్మిస్తున్నామన్నారు. స్కూల్ నిర్మాణం కోసం 15 కుటుంబాల వరకు 25 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇవ్వడం గర్వించదగ్గ విషయమన్నారు. వారికి ప్రభుత్వం నుంచి పక్కనే అందుబాటులో ఉన్న భూమిని సర్వే చేయించి ఇస్తామన్నారు.
నిజాంపేట్ లో కొత్త పీహెచ్ సీ ప్రారంభం..
నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండలంలో నూతనంగా నిర్మించిన పీహెచ్ సీ భవనాన్ని బుధవారం తెలంగాణ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ,జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్,ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్మల జగ్గారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నగేష్ శెట్కార్, సుధాకర్ రెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ట్రైని కలెక్టర్ మనోజ్, ఆర్డిఓ అశోక చక్రవర్తి, డిఎస్పీ వెంకట్ రెడ్డి వివిధ మండలాల సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.