సింగూరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి దామోదర రాజనర్సింహ

సింగూరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి దామోదర రాజనర్సింహ

పుల్కల్, వెలుగు : సింగూరు ప్రాజెక్ట్‌‌ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌‌ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్ట్‌‌ను సోమవారం ఆయన సందర్శించి, ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. ప్రాజెక్ట్‌‌ దిగువ భాగంలోని 29 ఎకరాల్లో రూ. 5 కోట్లతో అధునాతన రెస్టారెంట్, 25 కాటేజీలు నిర్మించాలని, చిల్ట్రన్‌‌ ప్లే ఏరియా, ఫుడ్‌‌ కోర్ట్, గార్డెనింగ్, గ్రీనరీ, ల్యాండ్‌‌ స్కేటింగ్, పార్కింగ్‌‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సింగూర్‌‌ డ్యాం పైభాగంలో బీటీ రోడ్డు నిర్మించాలని సూచించారు. పర్యాటకులు డ్యాం పైకి వెళ్లేందుకు మెట్లు నిర్మించాలని, పార్క్‌‌ అభివృద్ధితో పాటు సైక్లింగ్‌‌, వాకింగ్‌‌ ట్రాక్‌‌, సెంట్రల్‌‌ లైటింగ్‌‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వచ్చేలా సౌకర్యాలు మెరుగుపరచాలని సూచించారు.

పెద్దారెడ్డిపేట ఎక్స్ రోడ్డు నుంచి సింగూర్‌‌ డ్యామ్‌‌ వరకు రహదారి విస్తరణ చేపట్టాలని ఆర్‌‌అండ్‌‌బీ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో అంధోల్‌‌ ఆర్డీవో పాండు, నీటిపారుదల శాఖ ఆఫీసర్లు జై భీమ్, నాగరాజు, ఆర్‌‌అండ్‌‌బీ ఇంజినీర్లు రవీందర్, జగదీశ్వర్, పర్యాటక శాఖ అధికారి నటరాజ్ పాల్గొన్నారు.