
- మెదక్ లోక్ సభ ఎలక్షన్ కోఆర్డినేటర్ బాధ్యతలు
- అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు చోట్ల బీఆర్ఎస్ గెలుపు
- కాంగ్రెస్ గెలవాలంటే కష్టపడాల్సిందే
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది. ఈ మేరకు ఇప్పటి నుంచే ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని అన్ని లోక్ సభ నియోజక వర్గాలకు కో ఆర్డినేటర్లను నియమించింది.
ఇందులో భాగంగా మెదక్ లోక్‌సభ నియోజక వర్గానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను కో ఆర్డినేటర్ గా నియమించింది. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ లోక్ సభ నియోజక వర్గంలో 6 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా, కేవలం ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు దామోదరకు బిగ్ టాస్క్ కానుంది.
25 ఏళ్ల తర్వాత..
రెండున్నర దశాబ్దాల కాలంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పట్టు బిగించి వరుస విజయాలతో మెదక్ లోక్‌సభ స్థానంలో పాగా వేశాయి.1998లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత ఎం. బాగారెడ్డి ఎంపీగా గెలుపొందగా ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు కాంగ్రెస్ గెలవలేదు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన విజయశాంతి ఎంపీగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్అధినేత కేసీఆర్, 2019లో అదే పార్టీకి చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. తద్వారా మెదక్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా మార్చుకుంది.
హస్తం పార్టీ ప్రత్యేక దృష్టి
తాజాగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్మెదక్ లోక్ సభ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహాకు మెదక్లోక్సభ స్థానంలో కాంగ్రెస్‌పార్టీని గెలిపించే బాధ్యతలు అప్పగించింది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 6 చోట్ల సంగారెడ్డి, పటాన్‌చెర్, నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా, కేవలం ఒక్క మెదక్అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మెదక్ మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచిన గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు లభించిన ఓట్లలో భారీ వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అంత సులువయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల లోపు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలులోకి వస్తే ఓటర్లలో మార్పు వచ్చి కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కలిసికట్టుగా పనిచేస్తేనే..
గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో ఓటమికి కాంగ్రెస్ నాయకులందరు కలిసి కట్టుగా పనిచేయకపోవడం, ఓవర్ కాన్ఫిడెన్స్, కొన్ని చోట్ల నాయకుల మధ్య వర్గ విబేధాలు కారణమన్న అభిప్రాయం ఉంది. ముఖ్యంగా సిట్టింగ్స్థానమైన సంగారెడ్డిలో ఓటమి చెందడం ఆ పార్టీకి షాక్ఇచ్చింది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని, తదనుగుణంగా లోపాలు సరిదిద్దాలి.
కాంగ్రెస్నాయకులందరిని ఏకతాటిమీదకు తీసుకువచ్చి కలిసి కట్టుగా పనిచేసేలా చూస్తే గానీ ఆశించిన ఫలితం దక్కదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో లోక్‌సభ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా నియమితులైన మంత్రి దామోదర రాజనర్సింహా ఎన్నికల్లో విజయసాధనకు ఎలాంటి వ్యూహ రచన చేస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.