- మంత్రి దామోదర రాజనర్సింహ
మెదక్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లు స్పీడప్చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా గ్రంథాలయంలో ధాన్యం కొనుగోలు, మిల్లర్స్ అండర్ టేకింగ్, డిఫాల్ట్ మిల్లుల సమస్యలపై సివిల్సప్లై, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో రైతులు కొనుగోలు సమస్యలతో ఇబ్బందులు పడకూడదన్నారు. రైస్ మిల్లర్స్ అండర్ టేకింగ్ త్వరగా సబ్మిట్ చేసి ధాన్యం దింపుకునేలా చూడాలన్నారు.
లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలో దిగుమతి సాధ్యం కాదని ఇతర జిల్లాలకు పంపించాల్సిన అవసరం ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా సివిల్సప్లై కమిషనర్ తో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతకుముందు డిఫాల్ట్ మిల్లులకు సంబంధించి , అన్ ఫాల్ట్ బియ్యం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని 25 శాతం బ్యాంకు గ్యారంటీ ఇప్పించాలని మంత్రికి మిల్లర్లు వినతి పత్రం ఇచ్చారు.
ఈ మేరకు10 శాతం బ్యాంకు గ్యారంటీ ఇచ్చేలా సంబంధిత నివేదికలు తయారు చేయాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే రోహిత్ రావు, అడిషనల్ కలెక్టర్ నగేశ్, సివిల్సప్లై డీఎం హరికృష్ణ, డీఎస్ వో సురేశ్ రెడ్డి, డీఆర్డీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పీఏసీఎస్ బిల్డింగ్ ప్రారంభించిన మంత్రి
కౌడిపల్లి: మండలంలోని మహమ్మద్ నగర్ గేటు వద్ద రూ.54 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కొత్త బిల్డింగ్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. సొసైటీ చైర్మన్ బాన్సువాడ గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం కౌడిపల్లిలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్‌తో మాట్లాడారు. ఇక నుంచి షిఫ్టింగ్ పద్ధతిలో కాంకుడా స్టూడెంట్స్‌కు సొంత భవనంలోనే విద్యా బోధన ప్రారంభించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నర్సాపూర్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీవో కరుణ, డీఏవో గోవింద్ పాల్గొన్నారు.
డయాలసిస్ కేంద్రం ప్రారంభం
నర్సాపూర్: నర్సాపూర్ ఏరియా ఆస్పత్రిలో ఐదు పడకల సామర్థ్యంతో రూ.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే సునీతా రెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి మంత్రి దామోదర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెదక్ జిల్లా ఆస్పత్రిలో సుమారు 100 మందికి పైగా డయాలసిస్ రోగులు చికిత్స పొందుతున్నారని వారిలో 22 మంది నర్సాపూర్‌కు చెందిన వారన్నారు. త్వరలో ఐసీయూ ఎన్ టీసీ ట్రామా అత్యవసర శాఖలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.