రైతుకు అండగా కాంగ్రెస్ ​ప్రభుత్వం : మంత్రి దామోదర రాజనర్సింహ

రైతుకు అండగా కాంగ్రెస్ ​ప్రభుత్వం : మంత్రి దామోదర రాజనర్సింహ

పుల్కల్, వెలుగు: రైతుకు అండగా నిలిచేది కాంగ్రెస్​ప్రభుత్వమేనని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం చౌటకూర్​ మండలం తాడ్దాన్​పల్లి చౌరస్తాలోని ఫంక్షన్​హాల్లో జరిగిన జోగిపేట్ డివిజన్ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రూ. 170 కోట్లతో సింగూరు కాల్వలకు సీసీ లైనింగ్ పనులను చేపడుతున్నట్లు చెప్పారు. ఆందోల్ నియోజక వర్గంలో ఫార్మా కాలేజ్, హాస్పిటల్  నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. త్వరలో ఫార్మా పీజీ  కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.  

సుల్తాన్​పూర్ జేఎన్టీయూ త్వరలో విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందబోతుందన్నారు. చౌటకూర్ మండలానికి పీహెచ్​సీ, అంబులెన్స్, పోలీస్ స్టేషన్, కేజీవీబీ స్కూల్​ను మంజూరు చేస్తామన్నారు. సంగారెడ్డి జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో ఆత్మ కమిటీలను త్వరలో నియమిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్ షెట్కార్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్లు అంజయ్య, సుహాసిని రెడ్డి, నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్​చార్జి అంజిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, 23 మంది సభ్యులు పాల్గొన్నారు.

చివరి గింజ వరకు కొంటాం

జోగిపేట: కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ధాన్యం  చివరి గింజ వరకు కొంటామని మంత్రి దామోదర రాజనర్సిహ రైతులకు భరోసా ఇచ్చారు. గురువారం పట్టణంలోని జోగినాథస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణానికి హాజరై అనంతరం స్థానిక మార్కెట్​లో కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత సీజన్ లో వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 95,687 ఎకరాల్లో రైతులు వరి పండిస్తున్నారన్నారు.

ఇందులో దొడ్డు ధాన్యం 28,013 ఎకరాలలో కాగా  సన్న ధాన్యం 7654 ఎకరాలు ఉన్నట్లు చెప్పారు.  ఈ సీజన్ లో 218 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.  కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ మాధురి, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ జగన్ మోహన్ రెడ్డి, సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్ రెడ్డి, సివిల్ సప్లై మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్, పీడీ డీఆర్డీఏ జ్యోతి, జిల్లా సహకార అధికారి కిరణ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, ఆర్డీవో పాండు పాల్గొన్నారు.