న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదని, జనాభా ప్రాతిపదికన ఎవరి వాటా వారికి దక్కాలన్నారు. ఈ వ్యవహారంలో లీగల్ అంశాలు, సవరణలకు తమ ప్రభుత్వం సిద్ధమని చెప్పారు. తెలంగాణలో దళితులకు సామాజిక న్యాయం కావాలంటే ఎస్సీ వర్గీకరణ ఒక భాగమైతే, సబ్ ప్లాన్ రెండో భాగమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వాగ్ధానం చేసినట్లుగానే వర్గీకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతా రావు, అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, పీసీసీ జనరల్ సెక్రటరీ కొండేటి మల్లయ్య, కాంగ్రెస్ నేత మురళీధర్ రావు లతో కలిసి మంత్రి దామోదర మీడియాతో మాట్లాడారు. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు ప్రారంభమైనట్లు చెప్పారు.
ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం కూడా భాగమైన నేపథ్యంలో తామంతా సుప్రీంకోర్టు ముందు హాజరైనట్లు చెప్పారు. మాదిగ వర్గానికి మేలు జరిగేలా తెలంగాణ తరఫున రాష్ట్ర ప్రభుత్వం మాజీ సొలిసిటర్ జనరల్ వివేక్ కృష్ణ థన్కా ను నియమించిందన్నారు. సీఎం రేవంత్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ ఏర్పాట్లు చేసి, తమకు డైరెక్షన్ ఇచ్చారన్నారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తయి.. తొందర్లోనే సుప్రీంకోర్టులో తమకు సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో బీఆర్ఎస్ ఆదివాసీలు, దళితులు అస్థిత్వం కోల్పోయేలా వ్యవహరించిందని మంత్రి విమర్శించారు.
ALSO READ: ఎంపీ వెంకటేశ్‌ను చేర్చుకోవడం సరికాదు: ఆరిజిన్ డెయిరీ సీఏఓ షేజల్