జీఓలు ఇచ్చి చేతులు దులుపుకుంటే మెడికల్ కాలేజీలు రావని తెలిపారు మంత్రి దామోదర రాజనర్సింహ. గత పాలకులు ఎన్నికల్లో లబ్దిపొందేందుకు హడావిడిగా 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు జీవోలు ఇచ్చారని ట్వీట్ చేశారు మంత్రి. మెడికల్ కాలేజీలకు బిల్డింగ్ లేదు, హాస్టల్ లేదు, హాస్పిటల్ లేదు, స్టాఫ్ ను నియమించలేదు, ఎక్విప్ మెంట్ కొనలేదని.. కానీ కాలేజీలు ఏర్పాటు చేశామని BRS నేతలు డబ్బా కొట్టుకున్నారని విమర్శించారు. పబ్లిక్ హెల్త్ ప్రొఫైల్ పై బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్ వి కర్ణన్, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ విశాలాక్షి, DME డా. వాణి, Tvvp కమీషనర్ డా. అజయ్ కుమార్, రాష్ట్రం లోని ప్రవేట్ హాస్పటల్స్ ప్రతినిధుల పాల్గొన్నారు. కేసీఆర్ కృషితోనే మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయన్న మాజీమంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి. ఇప్పటికైనా అబద్దాలు, అసత్యాలు చెప్పడం మానుకోవాలని హరీశ్ రావుకి సూచించారు.
Also Read :- స్కూల్ క్లాస్ లీడర్ ఎన్నికల్లో EVM ఓటింగ్
NMC తనిఖీల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన డొల్లతనమంతా బయటపడిందన్నారు మంత్రి రాజనర్సింహ. సరైన సౌకర్యాలు లేకపోవడంతో కాలేజీలు ఇచ్చేది లేదని NMC తేల్చి చెప్పిందన్నారు. విద్య,వైద్యంపై చిత్తశుద్ధితో తాము యుద్ధప్రాతిపదికన NMC నిబంధనలకు అనుగుణంగా మెడికల్ కాలేజీలను, హాస్పిటళ్లను తయారు చేశామన్నారు రాజనర్సింహ.
ఫస్ట్ అప్పీల్ లో NMCని ఒప్పించి ములుగు, గద్వాల్, నారాయణ పేట్, నర్సంపేట్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చామన్నారు మంత్రి. యాదాద్రి, మెదక్ లో ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 220 బెడ్ల హాస్పిటళ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. వనస్థలిపురం, మల్కాజ్ గిరిలో ఉన్న 50 బెడ్ల దవాఖాన్లను.. 220 బెడ్లకు అప్ గ్రేడ్ చేసి టీచింగ్ హాస్పిటళ్లుగా తీర్చిదిద్దామన్నారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి కుత్బుల్లాపూర్, మహేశ్వరంలో అసలు దవాఖానాలే లేవని చెప్పారు. సెకండ్ అప్పీల్ లో కేంద్ర ఆరోగ్యశాఖను ఒప్పించి.. యాదాద్రి, మెదక్, కుత్బుల్లాపూర్, మహేశ్వరం కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చామని తెలిపారు రాజనర్సింహ.