హైదరాబాద్: వేతనాల పెంపు కోసం ఆశా వర్కర్లు చేస్తోన్న ధర్నాపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళవారం (డిసెంబర్ 10) ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆశా వర్కర్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం ప్రతిపక్ష పార్టీ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని చాటేలా ప్రజా విజయోత్సవాలు జరుగుతుంటే చూసి తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆశా వర్కర్లను రెచ్చగొట్టారని ఆరోపించారు.
గత పదేళ్ళు పాలనలో ఆశా వర్కర్ల వేతనాల పెంపుపై ఎన్నిసార్లు నిరసనలు, ధర్నాలు చేసిన పట్టించుకోనివాళ్లు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూన్నారని.. ఇది వారి ద్వంద వైఖరి కీ నిదర్శనమని అన్నారు. 2015లో 106 రోజులు వేతనాలు పెంచాలని ధర్నా చేసిన ఆశా వర్కర్లను గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని.. 2018, 2020, 2021, 2023 సంవత్సరాలలో ఆశా వర్కర్లు సమ్మెలు, ధర్నాలు గుర్తు చేశారు. అప్పుడు ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించలేని వాళ్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ | సాగర తీరాన నిలువెత్తు సాక్ష్యం.. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ప్రశాంత్ రెడ్డి కౌంటర్
ఆశా వర్కర్లు సంయమనంతో వ్యవహరించాలని.. రాజకీయ ప్రేరేపిత ధర్నా, నిరసనలు తెలిపే వారి ఉచ్చులో పడొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రభుత్వం ఆశా వర్కర్ల స్వేచ్ఛను గౌరవిస్తుందని తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఆశా వర్కర్ల నిరసనలో సొమ్ముసిల్లి పడిపోయిన ఆశా వర్కర్ రహీం బీ కీ ఉస్మానియా ఆస్పత్రిలో మెరుగైన చికిత్సను అందించాల్సిందిగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు.